కోకాపేట భూముల వేలంపై ఆరోపణలు నిరాధారం

కోకాపేట, ఖానామెట్‌ భూముల వేలంపై  వస్తోన్న ఆరోపణలపై తెలంగాణ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఈ భూముల వేలంపై.....

Updated : 20 Jul 2021 17:33 IST

తెలంగాణ ప్రభుత్వం వివరణ

హైదరాబాద్‌: కోకాపేట, ఖానామెట్‌ భూముల వేలంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. ఈ భూముల వేలంపై ఆరోపణలు నిరాధారమని స్పష్టంచేసింది. ఈ మేరకు ఆరు పేజీలతో కూడిన వివరణతో ఓ ప్రకటనను విడుదల చేసింది. ‘‘భూముల వేలం పారదర్శకంగా జరిగింది. వేలంలో పాల్గొనకుండా ఎవరినీ నియంత్రించలేదు. ఎవరైనా ఒక బిడ్‌ను ప్రభావితం చేస్తారనేది కేవలం అపోహే. ఆన్‌లైన్‌లో 8 నిమిషాల పాటు వేలం పాటకు అవకాశం కల్పించాం. 8 నిమిషాలు ఎవరూ ఆసక్తి చూపకపోతేనే బిడ్‌ని ఖరారు చేశాం. ప్లాట్ల ధరల్లో వేర్వేరు ధరలు ఉండటంలో ఆశ్చర్యంలేదు. భూముల వేలానికి స్విస్‌ ఛాలెంజ్‌ పద్ధతి సరికాదు. ఈ పద్ధతి పోటీని కొందరికే పరిమితం చేస్తుంది.  ఇకముందు ఇలాంటి ఆరోపణలు చేస్తే పరువు నష్టం చర్యలు తీసుకుంటాం. వేలం గురించి నెల రోజులుగా ప్రచారం చేస్తున్నాం. పోటీని నివారించారని, రెవెన్యూ తగ్గించారనే ఆరోపణలు నిరాధారం. కొన్ని సంస్థలకే మేలు చేశారన్న ఆరోపణలు కూడా నిరాధారమైనవి’’ అని ప్రభుత్వం పేర్కొంది.

తెలంగాణ ప్రభుత్వం తరఫున హెచ్‌ఎండీఏ, టీఎస్‌ఐఐసీ ఇటీవల చేపట్టిన భూముల వేలంలో విధానపరమైన అవకతవకలు జరిగినట్టు కొన్ని వార్తా పత్రికల్లో వచ్చిన కథనాలపై రికార్డుల ఆధారంగా ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత తమపై ఉందని ప్రభుత్వం తన ప్రకటనలో పేర్కొంది. ‘‘నివాస, వాణిజ్య, సంస్థాగత, ప్రజా అవసరాలకు సంబంధించి ఈ భూములను వేలం వేయడం గతంలో ఉమ్మడి ఏపీలో, దేశంలోని పలు రాష్ట్రాల్లో జరుగుతున్నది. దిల్లీ డెవలప్‌మెంట్‌ అథారిటీ, మహారాష్ట్ర, కర్ణాటక, యూపీలాంటి రాష్ట్రాల్లోనూ ఇలాంటి ప్రక్రియ నిరంతరం జరుగుతోంది.  రెవెన్యూ సముపార్జనే లక్ష్యంగా కనిపిస్తున్నప్పటికీ పట్టణాల్లో ప్రణాళికాబద్ధమైన వృద్ధి, రోజురోజుకీ పెరుగుతున్న నివాస, వాణిజ్య సంబంధమైన అవసరాలను తీర్చడమే ముఖ్య ఉద్దేశం’’ అని తెలిపింది. 

‘‘నగరాభివృద్ధికి దోహదపడే అత్యంత వ్యూహాత్మక ప్రాంతాలైన కోకాపేట్‌, ఖానామెట్‌ భూముల వేలం ఇదివరకే జరిగింది. ఇది ఒక కొనసాగింపు ప్రక్రియే. జులై 15, 16తేదీల్లో జరిగిన వేలంలో కోకాపేటలో  49.45 ఎకరాల భూమిని 8 ప్లాట్లుగా, ఖానామెట్‌లో 15.01 ఎకరాల భూమిని 5 ప్లాట్లుగా వేలం వేశాం. ఈ వేలం పాటను నిపుణులైన భారత ప్రభుత్వరంగ సంస్థ ఎంఎస్‌టీసీ లిమిటెడ్‌, ఈ- ఆక్షన్‌ ఆధారిత ఆన్‌లైన్‌ బిడ్‌ పద్ధతి ద్వారా అత్యంత పారదర్శకంగా నిర్వహించాం. దీంట్లో ఎలాంటి సంశయాలకూ తావులేదు’’అని తెలిపింది.

‘‘కోకాపేట, ఖానామెట్‌ భూముల వేలంలో పోటీని నివారించామని, రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన రెవెన్యూ తగ్గించామన్న ఆరోపణలన్నీ నిరాధారం. బిడ్డింగ్‌లో కొన్ని సంస్థలకే మేలు చేశామన్న ఆరోపణలూ ఊహాతీతమైనవే. వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండా, ఇలాంటి పారదర్శకమైన పద్ధతిని తప్పుపట్టడం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల ప్రతిష్ఠకు భంగం కలిగించే చర్యలకు పాల్పడటాన్ని ఊపేక్షించబోం. ఇకముందు ఇలాంటి కల్పిత ఆరోపణలపై న్యాయపరమైన పరువు నష్టం చర్యలు తీసుకోవడం జరుగుతుంది’’ అని ప్రభుత్వం హెచ్చరించింది. 

మరోవైపు, కోకాపేట భూముల వేలంలో రూ. 1000కోట్ల అవినీతి జరిగిందంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. నిన్న కోకాపేట భూముల సందర్శనకు కాంగ్రెస్‌ పిలుపునివ్వగా ఆ పార్టీ నేతలను పోలీసులు గృహనిర్బంధం చేసిన విషయం తెలిసిందే. వేలం ఆరోపణలపై స్పందించిన ప్రభుత్వం ఈ భూముల వేలంపై ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలు నిరాధారమని తేల్చి చెప్పింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని