TS News: సంచలన తీర్పు.. 16ఏళ్ల బాలిక అబార్షన్‌కు హైకోర్టు అనుమతి

తెలంగాణ హైకోర్టు గురువారం సంచలన తీర్పు వెలువరించింది. అత్యాచారంతో బాలిక దాల్చిన గర్భం తొలగింపునకు అనుమతిచ్చింది. 16 ఏళ్ల బాలిక 26 వారాల పిండాన్ని తొలగించాలని

Published : 08 Oct 2021 02:43 IST

హైదరాబాద్‌: తెలంగాణ హైకోర్టు గురువారం సంచలన తీర్పు వెలువరించింది. అత్యాచారానికి గురైన బాలిక దాల్చిన గర్భాన్ని తొలగించేందుకు అనుమతిచ్చింది. 16 ఏళ్ల బాలిక 26 వారాల పిండాన్ని తొలగించాలని కోఠి ప్రసూతి ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. నిపుణులతో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డి ఈమేరకు కీలకకు తీర్పు వెలువరించారు.. 16ఏళ్ల బాలికపై సమీప బంధువు ఆంజనేయులు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికకు ఆసుపత్రిలో పరీక్షలు చేయించగా.. గర్భవతిగా వైద్యులు నిర్ధారించారు. అవాంఛితగర్భాన్ని తొలగించాలని బాలిక, ఆమె తల్లి కోరగా... కోఠి ప్రసూతి ఆసుపత్రి వైద్యులు నిరాకరించారు. ఆమె తల్లి ద్వారా బాలిక హైకోర్టును ఆశ్రయించారు.

బాలిక ఆరోగ్యపరిస్థితిపై వైద్యుల కమిటీని ఏర్పాటు చేసిన హైకోర్టు .. నివేదిక సమర్పించాలని ఆదేశించింది. పరీక్షలు జరిపిన వైద్యుల కమిటీ.. పిండం వయసు 25 వారాలుగా తేల్చి.. కొన్ని జాగ్రత్తలతో నిపుణులు అబార్షన్‌ చేయవచ్చని సూచించింది. వివిధ అంశాలను పరిశీలించిన హైకోర్టు బాలికకు అబార్షన్‌ చేయాలని ఆదేశించింది. చట్ట ప్రకారం 24 వారాలకు మించి వయసు ఉన్న పిండం తొలగింపునకు ఆదేశాలు ఇచ్చే అధికారం రాజ్యాంగ కోర్టులకు ఉందని తెలిపింది. గర్భం కోరుకునే హక్కుతో పాటు.. చట్టపరిమితులకు లోబడి వద్దనుకునే హక్కు కూడా ఉంటుందని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దురదృష్టఘటనతో వచ్చిన అవాంఛనీయ గర్భాన్ని తొలగించకపోతే.. తీవ్ర మానసిక, శారీరక ఒత్తిడి ఆరోగ్యంపై ప్రభావం చూపే ప్రమాదముందని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. తీవ్రమైన మానసిక ఒత్తిడి వల్ల పుట్టబోయే శిశువు ఆరోగ్యంపై ప్రభావం ఉండొచ్చునని పేర్కొంది. పిండం హక్కుల కంటే అత్యాచార బాధితురాలికి రాజ్యాంగం కల్పించిన హక్కులే ప్రాధాన్యమని స్పష్టం చేసింది. హుందాగా, ఆత్మగౌరవంతో, ఆరోగ్యకరంగా జీవించే హక్కు మహిళలకు ఉందని పేర్కొంది. అన్ని జాగ్రత్తలతో.. నిపుణులతో గర్భవిచ్చిత్తి ప్రక్రియ చేపట్టాలని కోఠి ప్రసూతి ఆస్పత్రి సూపరింటెండెంట్ ను ఆదేశించింది. పిండం నుంచి రక్తం, కణజాలం, డీఎన్ఏ సేకరించి ఫోరెన్సిక్ లేబొరేటరీకి పంపించాలని తెలిపింది. ఫోరెన్సిక్ లేబొరేటరీ నివేదికలు వచ్చిన తర్వాత... కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులకు పంపించాలని తీర్పులో పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని