TS High court: ప్రశ్నప్రతాల లీకేజీ కేసు.. సీబీఐకి బదిలీ చేయాల్సిన అవసరమేంటి?: హైకోర్టు

టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసును సీబీఐకి బదిలీ చేయాల్సిన అవసరమేంటని తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని సిట్‌ను, టీఎస్‌పీఎస్సీని ఆదేశించింది.

Updated : 09 Jun 2023 19:07 IST

హైదరాబాద్‌: ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారిస్తున్న టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసు (TSPSC Paper leak case)ను సీబీఐకి బదిలీ చేయాల్సిన అవసరమేంటని తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. ప్రశ్నపత్రాల లీకేజీపై దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయాలని కోరుతూ ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌తో పాటు పలువురు అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లపై శుక్రవారం ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది.

ఈ సందర్భంగా అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ.. పేపర్‌ లీకేజీపై సిట్‌ దర్యాప్తు చురుగ్గా, నిష్పక్షపాతంగా జరుగుతోందని న్యాయస్థానానికి తెలిపారు. నిందితుల్లో 37 మందిపై ఛార్జ్‌షీట్‌ కూడా వేసినట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు సిట్ దర్యాప్తు పూర్తిస్థాయిలో జరగడం లేదని, ఒత్తిళ్లకు గురవుతోందని అందుకే సీబీఐకి బదిలీ చేయాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం.. సిట్ దర్యాప్తు కొనసాగుతుండగా ప్రస్తుత దశలో సీబీఐకి బదిలీ చేయడం ఎందుకని ప్రశ్నించింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని సిట్‌ను, టీఎస్‌పీఎస్సీని ఆదేశిస్తూ.. విచారణను 3 వారాలకు వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని