Telangana news: రేపు వెళ్లి స్పీకర్‌ను కలవండి.. భాజపా ఎమ్మెల్యేలకు హైకోర్టు సూచన!

తెలంగాణ అసెంబ్లీలో భాజపా ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ వ్యవహారంపై హైకోర్టులో విచారణ ముగిసింది. ఎమ్మెల్యేలు రేపు స్పీకర్‌ను కలవాలని ఉన్నత న్యాయస్థానం సూచించింది.....

Updated : 14 Mar 2022 19:03 IST

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీలో భాజపా ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ వ్యవహారంపై హైకోర్టులో విచారణ ముగిసింది. ఎమ్మెల్యేలు రేపు స్పీకర్‌ను కలవాలని ఉన్నత న్యాయస్థానం సూచించింది. ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ వ్యవహారంపై ఈ ఉదయం నుంచి హైకోర్టులో పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై సింగిల్‌ జడ్జి స్టే ఇచ్చేందుకు నిరాకరించగా.. భాజపాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలూ ధర్మాసనం వద్ద అప్పీల్‌ దాఖలు చేశారు. అత్యవసర విచారణ చేపట్టాలని కోరారు. దీంతో ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఉదయం ఈ అంశాన్ని ప్రస్తావించినప్పుడే అసెంబ్లీ కార్యదర్శికి తాము నోటీసులు ఇచ్చేందుకు ఎంతగా ప్రయత్నించినా ఆయన సహకరించలేదనీ.. ఉద్దేశపూర్వకంగానే నోటీసులు తీసుకోవడం లేదని ఎమ్మెల్యేల తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో హైకోర్టు జ్యుడిషియల్‌ రిజిస్ట్రార్‌ దీన్ని వ్యక్తిగతంగా తీసుకొని అసెంబ్లీ కార్యదర్శికి కచ్చితంగా నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు సిబ్బంది లోపలికి వెళ్లి కార్యదర్శికి నోటీసులు ఇచ్చే విధంగా నగర పోలీస్‌ కమిషనర్‌ కూడా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో జ్యుడిషియల్‌ రిజిస్ట్రార్‌ ఈ మధ్యాహ్నం అసెంబ్లీకి వెళ్లి నోటీసులు అందజేశారు. కార్యదర్శి నోటీసులు తీసుకున్నట్టు సాయంత్రం 4గంటలకు విచారణ సందర్భంగా జ్యుడిషియల్‌ రిజిస్ట్రార్‌ వెల్లడించారు.

భాజపా ఎమ్మెల్యేల తరఫున  సీనియర్‌ న్యాయవాది ప్రకాశ్‌ రెడ్డి వాదనలు వినిపించారు. శాసనసభ నియమావళికి విరుద్ధంగా సస్పెండ్‌చేశారని కోర్టుకు తెలిపారు. స్పీకర్‌ ఎలాంటి ప్రస్తావన చేయకుండానే నేరుగా మంత్రి తీర్మానం ప్రవేశపెట్టడం.. వెంటనే దాన్ని ఆమోదించడం.. ఇదంతా ముందస్తు ప్రణాళికతో చేశారని వాదించారు. అందువల్ల ఎమ్మెల్యేలపై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని కోరారు. దీంతో ఈ అంశంపై తుది నిర్ణయం స్పీకరే తీసుకోవాలని కోర్టు తెలిపింది. మంగళవారం ఎమ్మెల్యేలు ముగ్గురూ వెళ్లి స్పీకర్‌ను కలవాలని సూచించింది. వారిని స్పీకర్‌తో కలిపే బాధ్యత కార్యదర్శి తీసుకోవాలంది. రేపటి సమావేశాలకు హాజరయ్యేందుకు అనుమతివ్వాలంటూ స్పీకర్‌ను భాజపా ఎమ్మెల్యేలు కోరాలని సూచించింది. ఈ అంశంలో స్పీకర్‌ తగిన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్టు పేర్కొంది. రాజకీయాలకతీతంగా, పార్టీలకతీతంగా సభ ఉంటుంది గనక సభాపతిగా ఈ సమస్యను పరిష్కరించేందుకు తగిన నిర్ణయం తీసుకుంటామని ఆశిస్తున్నట్టు న్యాయస్థానం పేర్కొంది. ప్రజాస్వామ్యం ఫరిఢవిల్లాలంటే ప్రశ్నించేవారూ ఉండాలని తెలుపుతూ విచారణను ముగించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని