రైస్‌ మిల్లర్లతో మంత్రి గంగుల సమావేశం

ఎర్రమంజిల్‌లోని పౌరసరఫరాల భవన్‌లో రైస్‌ మిల్లర్లు, చౌక ధరల దుకాణాల డీలర్లతో మంత్రి గంగుల కమలాకర్‌ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రితో పాటు

Published : 15 Sep 2020 23:50 IST

హైదరాబాద్‌: ఎర్రమంజిల్‌లోని పౌరసరఫరాల భవన్‌లో రైస్‌ మిల్లర్లు, చౌక ధరల దుకాణాల డీలర్లతో మంత్రి గంగుల కమలాకర్‌ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రితో పాటు పౌరసరఫరాల ఛైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి, పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ వి. అనిల్‌కుమార్‌, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 2020 ఖరీఫ్‌ మార్కెటింగ్‌ సీజన్‌లో ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై విస్తృతంగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పెరుగుతున్న ధాన్యం దిగుబడులకు అనుగుణంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని మిల్లర్లకు సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందుచూపు, దార్శనికతతో చేపట్టిన రైతు సంక్షేమ చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయని పేర్కొన్నారు. 
సాగు నీటి ప్రాజెక్టులు, 24 గంటల కరెంటు, రైతుబంధు వంటి పథకాలతో సాగు విస్తీర్ణం పెరిగి ఏటేటా ధాన్యం దిగుబడులు గణనీయంగా పెరుగుతున్నాయని మంత్రి గంగుల అన్నారు. గతేడాదితో పోలిస్తే  ఈ వానా కాలంలో 36.94 శాతం సాగు విస్తీర్ణం పెరగడంతో దేశంలోనే తెలంగాణ అగ్ర స్థానంలో ఉందన్నారు. గత ఏడాది వానాకాలంలో 47.54 లక్షల మెట్రిక్‌ టన్నులు, యాసంగిలో 64.50 మెట్రిక్‌ టన్నులు కలిపి మొత్తం కోటి 12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ఈ వానా కాలం సీజన్‌లో 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి తెలిపారు. రేషన్ డీలర్లు, రైస్ మిల్లర్లు పౌరసరఫరాల శాఖలో భాగస్వామ్యులని, రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక సామాజిక బాధ్యతగా ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఉద్దేశ్య పూర్వకంగా రేషన్ డీలర్లు, రైస్ మిల్లర్లను ఇబ్బంది పెట్టబోమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించి వారి న్యాయపరమైన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ ఏడాది ధాన్యం కొనుగోళ్లకు పెద్ద ఎత్తున గన్నీ సంచులు అవసరం ఉన్నాయని మంత్రి తెలిపారు. దాదాపు 10 కోట్లు కొత్తవి, 9 కోట్లు పాత గన్నీ సంచులు అవసరమున్నావన్నారు. కోల్‌కతా నుంచి అవసరమైన కొత్త గన్నీ సంచులు వచ్చే అవకాశం లేనందున పాత గన్నీ సంచుల అవసరం ఎక్కువగా ఏర్పడిందని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. 


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని