TS News: కొవిడ్‌ సోకిన వారికి అత్యవసర సేవలు నిరాకరించొద్దు: హరీశ్‌రావు

తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్‌, ఆసుపత్రుల సన్నద్ధత తదితర అంశాలపై మంత్రి హరీశ్‌రావు సమీక్ష నిర్వహించారు. కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన గర్భిణులకు

Published : 12 Jan 2022 01:36 IST

హైదరాబాద్‌: తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్‌, ఆసుపత్రుల సన్నద్ధత తదితర అంశాలపై మంత్రి హరీశ్‌రావు సమీక్ష నిర్వహించారు. కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన గర్భిణులకు అన్ని ఆసుపత్రుల్లో చికిత్స అందించాలని, దీనికి అనుగుణంగా ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక ఆపరేషన్‌ థియేటర్‌, వార్డును ప్రత్యేకంగా కేటాయించాలని ఆదేశించారు. అన్ని సౌకర్యాలు ఉండి కూడా, అనవసరంగా వారిని ఇతర ప్రభుత్వ పెద్దాసుపత్రులకు రిఫర్‌ చేయవద్దన్నారు. అత్యవసర సేవలు, శస్త్రచికిత్సలు అవసరమైన వారికి కొవిడ్ సోకిందని చికిత్స అందించేందుకు నిరాకరించవద్దని, వారికోసం ప్రత్యేకంగా ఆపరేషన్‌ థియేటర్‌, వార్డును ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లా వైద్యాధికారులు క్షేత్రస్థాయి పర్యటన చేయాలని, పరిస్థితులను తెలుసుకుంటూ అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. 

కరోనా తగ్గుముఖం పట్టే వరకు బస్తీ దవాఖానాలు, పీహెచ్‌సీలు, సబ్‌ సెంటర్లు ఆదివారం కూడా పని చేయాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. వ్యాక్సినేషన్‌, పరీక్షలు, హోమ్‌ ఐసోలేషన్‌ కిట్ల పంపిణీ జరగాలన్నారు. కొవిడ్‌ లక్షణాలతో ఎవరు వచ్చినా పరీక్ష చేసి, లక్షణాలు ఉంటే కిట్‌ ఇచ్చి పంపాలన్నారు. కేంద్రం జారీ చేసిన ఆదేశాల ప్రకారం ప్రతి పీహెచ్‌సీలో రాత్రి 10గంటల వరకు వ్యాక్సినేషన్‌ కార్యక్రమం చేపట్టాలని సూచించారు. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పీహెచ్‌సీలో ఉండి వైద్య సేవలు అందించాలన్నారు. వ్యాక్సినేషన్‌లో దేశంలోనే తెలంగాణ నెంబర్‌వన్‌గా ఉండాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ రెండు డోసులు ఇవ్వాలని, అందుకు స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలని సూచించారు. ఆరోగ్యశాఖకార్యదర్శి రిజ్వీ, డీఎంఈ రమేశ్‌రెడ్డి, డీపీహెచ్‌ శ్రీనివాసరావుతో కలిసి మంత్రి హరీశ్‌రావు అన్ని జిల్లాల డీఎంహెచ్‌వోలు, డీసీహెచ్‌వోలు, టీచింగ్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్లు, యూపీహెచ్‌సీ, పీహెచ్‌సీ వైద్యాధికారులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని