KTR: సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా భారీ సభ.. జనసమీకరణపై నేతలతో కేటీఆర్‌ భేటీ

దేశంలోనే ఎక్కడా లేని విధంగా సచివాలయానికి అంబేడ్కర్‌ పేరు పెట్టినందున అన్ని నియోజకవర్గాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని కేటీఆర్‌ సూచించారు. సచివాలయం ప్రారంభోత్సవం, పరేడ్‌గ్రౌండ్‌ సభను అందరూ కలిసికట్టుగా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 

Updated : 09 Feb 2023 17:57 IST

హైదరాబాద్‌: ఈనెల 17న సచివాలయం ప్రారంభోత్సవం తర్వాత సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో నిర్వహించనున్న సభకు భారీ జనసమీకరణ చేయాలని గ్రేటర్‌ నేతలకు మంత్రి కేటీ రామారావు(KTR) దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ కమిటీ హాల్‌లో హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేటీఆర్‌ సమావేశమయ్యారు. ప్రతి నియోజకవర్గం నుంచి కనీసం 10వేల మంది హాజరయ్యేలా చూడాలని నేతలకు సూచించారు. 

ఈనెల 13న గ్రేటర్‌ పరిధిలోని నియోజకవర్గాల్లో కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించాలన్నారు. ఒక్కో నియోజకవర్గానికి ఇతర జిల్లాలకు చెందిన సీనియర్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఇన్‌ఛార్జిలుగా నియమించనున్నట్టు కేటీఆర్‌ తెలిపారు. ఈనెల 13 నుంచి 17వరకు ఇన్‌ఛార్జిలు వారికి కేటాయించిన నియోజకవర్గాల్లోనే ఉండి జనసమీకరణ ఏర్పాట్లను పర్యవేక్షిస్తారని చెప్పారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా సచివాలయానికి అంబేడ్కర్‌ పేరు పెట్టినందున అన్ని నియోజకవర్గాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని కేటీఆర్‌ సూచించారు. సచివాలయం ప్రారంభోత్సవం, పరేడ్‌గ్రౌండ్‌ సభను అందరూ కలిసికట్టుగా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సభకు తమిళనాడు, ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రులు స్టాలిన్‌, హేమంత్‌ సోరెన్‌, బిహార్‌ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌ తదితరనేతలు హాజరుకానున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు