KTR: మెట్రో రైలు రెండో దశతో ప్రజా రవాణా మరింత బలోపేతం: మంత్రి కేటీఆర్‌

మెట్రో రైల్‌ రెండో దశ విస్తరణకు డిసెంబరు 9న సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో ఆ కార్యక్రమం సన్నాహక సమావేశాన్ని మంత్రి కేటీఆర్‌ నిర్వహించారు.

Published : 30 Nov 2022 18:56 IST

హైదరాబాద్‌: మెట్రో రైల్‌ రెండో దశ విస్తరణకు డిసెంబరు 9న సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో ఆ కార్యక్రమం సన్నాహక సమావేశాన్ని మంత్రి కేటీఆర్‌ నిర్వహించారు. మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మహమూద్‌ అలీ, సబితా ఇంద్రారెడ్డి, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మెట్రో రైల్‌, పురపాలక, ఎయిర్‌పోర్టు అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. హైదరాబాద్‌ నగరంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ఎయిర్‌పోర్టు మెట్రో కారిడార్‌ ఉపయోగపడుతుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. శంషాబాద్‌ నుంచి మొదలుకొని ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్‌ మధ్య ప్రయాణం చేసే లక్షలాది మందికి మెట్రో రైలు విస్తరణ ద్వారా లబ్ధి చేకూరుతుందన్నారు. ఇంతటి కీలకమైన కార్యక్రమం శంకుస్థాపనను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా కేటీఆర్‌ అధికారులను ఆదేశించారు.

డిసెంబరు 9న శంకుస్థాపన చేసే ప్రాంతంతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాల్గొనే సమావేశ ప్రాంగణం వంటి వాటి ఏర్పాట్లను రెండ్రోజుల్లో పూర్తి చేయాలని ఈ సందర్భంగా కేటీఆర్‌ అధికారులకు సూచించారు. ఇందుకు సంబంధించిన స్థలాల పరిశీలనకు మంత్రులు, ప్రజాప్రతినిధులు గురువారం క్షేత్రస్థాయిలో పర్యటించి, పరిశీలన చేయాలని సూచించారు. హైదరాబాద్‌ నగరానికి అత్యంత కీలకమైన ఈ ప్రాజెక్టు ఏదో ఒక నియోజకవర్గానికి సంబంధించిన కార్యక్రమం కాదని, ఇది మొత్తం నగర ప్రజల జీవితాల్లో భాగం కానున్న ప్రాజెక్టు అన్నారు. నగర వ్యాప్తంగా ఉన్న అందరు ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమం నిర్వహణలో భాగస్వాములైతే బాగుంటుందని కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు. ఇందుకోసం అవసరమైన నగర ప్రజా ప్రతినిధుల సమావేశాన్ని ఒకటి రెండురోజుల్లో ఏర్పాటు చేయాలని మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మహమూద్‌ అలీ, సబితా ఇంద్రారెడ్డిలకు మంత్రి కేటీఆర్‌ సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని