TSPSC Paper Leakage: జైలు నుంచి బెయిల్‌పై రేణుక రాథోడ్‌ విడుదల

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ఏ3గా ఉన్న రేణుక రాథోడ్‌ బెయిల్‌పై విడుదలయ్యారు.

Updated : 11 May 2023 20:33 IST

హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో ఏ3గా ఉన్న రేణుక రాథోడ్‌ బెయిల్‌పై విడుదలయ్యారు. నాంపల్లి కోర్టు బుధవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసినప్పటికీ.. పూచీకత్తులు సమర్పించడంలో ఆలస్యమైంది. రేణుక తరఫు న్యాయవాదులు గురువారం పూచీకత్తులు సమర్పించడంతో కోర్టు బెయిల్ ఆర్డర్‌ కాపీలను జారీ చేసింది. ఆమె తరఫు న్యాయవాది చంచల్ గూడ జైలు సూపరింటెండెంట్‌కు బెయిల్ ఆర్డర్‌ కాపీ అందించడంతో జైలు అధికారులు రేణుకను విడుదల చేశారు. 

మార్చి 13న బేగంబజార్ పోలీసులు రేణుకతో పాటు మిగతా నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అప్పటి నుంచి రేణుక చంచల్ గూడ మహిళా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. రేణుక అనారోగ్యం, మహిళ కావడం, దర్యాప్తు అంతిమ దశలో ఉందన్న కారణాలతో బెయిల్‌ మంజూరు చేయాలని ఆమె తరఫు న్యాయవాది గుమ్మకొండ శ్రీనివాసరావు తాజాగా న్యాయస్థానానికి విన్నవించారు. దీంతో ఆమెకు న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసింది.

టీఎస్‌పీఎస్సీలో పనిచేస్తున్న ప్రవీణ్‌తో ఉన్న పరిచయం మేరకు రేణుక ఏఈ ప్రశ్నాపత్రం కొనుగోలు చేసింది. తన భర్త డాక్యానాయక్ (ఏ4), సోదరుడు రాజేశ్వర్ నాయక్ ఆ పేపర్‌ను పలువురికి విక్రయించారు. వనపర్తిలోని గురుకుల పాఠశాలలో హిందీ పండిట్‌గా రేణుక పనిచేసే సమయంలో ప్రవీణ్‌తో పరిచయం ఏర్పడింది. ఇదే కేసులో నిందితులుగా ఉన్న రమేష్, ప్రశాంత్ రెడ్డికి సైతం నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రమేష్ బెయిల్ ఆర్డర్‌ను చంచల్ గూడ జైలుకు సకాలంలో అందించకపోవడంతో ఆయన శుక్రవారం ఉదయం విడుదల కానున్నారు. ప్రశాంత్ రెడ్డికి సంబంధించిన పూచీకత్తులు సమర్పించకపోవడంతో కోర్టు ఇంకా బెయిల్ ఆర్డర్ ఇవ్వలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని