TSPSC: తెలంగాణలో గ్రూప్-1 పోస్టులకు తొలి నోటిఫికేషన్‌ వచ్చేసింది!

తెలంగాణ యువతకు రాష్ట్ర ప్రభుత్వం మరో తీపికబురు అందించింది. నిన్న 16వేలకు పైగా పోలీస్‌ ......

Updated : 26 Apr 2022 22:37 IST

హైదరాబాద్‌: తెలంగాణ యువతకు రాష్ట్ర ప్రభుత్వం మరో తీపికబురు అందించింది. తెలంగాణ యువత ఎన్నాళ్లగానో వేచి చూస్తోన్న గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ వచ్చేసింది. నిన్న పోలీస్‌ శాఖలో 16,614 ఉద్యోగాలకు పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇవాళ టీఎస్‌పీఎస్సీ 503 గ్రూప్‌-1 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఈరోజు సాయంత్రం టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ జనార్దన్‌ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన కమిషన్‌ నోటిఫికేషన్‌ జారీ చేయాలని నిర్ణయించింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించాక ఇదే తొలి గ్రూప్‌ 1 నోటిఫికేషన్‌ కావడం విశేషం.

ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ ద్వారానే ఈ పోస్టుల్ని భర్తీ చేయనున్నారు. ఇంటర్వ్యూలు లేకుండా నియామకాలు జరపాలని నిర్ణయించారు. కాగా, ప్రిలిమ్స్‌ పరీక్ష జులై లేదా ఆగస్టు నెలలో, మెయిన్స్‌ పరీక్ష నవంబరు లేదా డిసెంబరు నెలలో జరిగేందుకు అవకాశాలున్నట్లు నోటిఫికేషన్‌లో టీఎస్‌పీఎస్సీ తెలిపింది. గ్రూప్-1 సర్వీసెస్‌లో తొలిసారి ఈడబ్ల్యూఎస్‌, స్పోర్ట్స్‌ కోటా రిజర్వేషన్‌ను అమలు చేయనున్నట్లు కమిషన్‌ పేర్కొంది.

రూల్ ఆఫ్ రిజర్వేషన్‌కు అనుగుణంగా మల్టీజోన్ల వారీగా ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు. తెలుగు, ఆంగ్లంతో పాటు తొలిసారిగా ఉర్దూలో కూడా గ్రూప్-1 పరీక్ష నిర్వహించనున్నారు. మెయిన్స్ పరీక్ష కోసం ఈ-ప్రశ్నాపత్రాన్ని రూపొందించడంతో పాటు ప్రక్రియ వేగవంతమయ్యేలా డిజిటల్ ఎవాల్యువేషన్‌ను ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. గ్రూప్-1కు దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా టీఎస్‌పీఎస్సీలో విధిగా ఓటీఆర్ నమోదు చేసుకోవాలని లేదా ఓటీఆర్ సవరించుకోవాలని కమిషన్ స్పష్టం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని