TSPSC: గ్రూప్‌-4 దరఖాస్తుల ప్రక్రియ వాయిదా.. కొత్త తేదీలివే..

తెలంగాణలో నిరుద్యోగులు ఎదురుచూస్తున్న గ్రూప్‌-4 ఉద్యోగాలకు నేటి నుంచి ప్రారంభం కావాల్సిన ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ వాయిదా పడింది. 

Updated : 23 Dec 2022 10:51 IST

హైదరాబాద్‌: తెలంగాణలో గ్రూప్‌-4 ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ వాయిదా పడింది. నేటి నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉండగా సాంకేతిక కారణాలతో వాయిదా వేస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. దరఖాస్తుల కోసం కొత్త తేదీలను వెల్లడించింది. ఈ నెల 30 నుంచి జనవరి 19 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపింది. మొత్తం 25 ప్రభుత్వ విభాగాల పరిధిలో 9,168 పోస్టులను టీఎస్‌పీఎస్సీ భర్తీ చేయనుంది. గ్రూప్‌-4 ఉద్యోగాలకు భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తాయని కమిషన్‌ అంచనా వేస్తోంది.

సిద్ధంగా గ్రూప్‌-2, 3 ప్రకటనలు

గ్రూప్‌-2, 3 పోస్టులకు ఉద్యోగ ప్రకటనలు జారీ చేసేందుకు టీఎస్‌పీఎస్సీ కసరత్తు పూర్తి చేసింది.  గ్రూప్‌-2, 3 కేటగిరీ పరిధిలోకి మరిన్ని ప్రభుత్వ విభాగాల్లోని పోస్టులను చేర్చడంతో ఆ మేరకు అదనంగా పోస్టులను గుర్తించి, వాటిని ప్రస్తుత ప్రకటనల్లో చేర్చింది. గ్రూప్‌-2 కింద తొలుత 663 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతించగా, అదనంగా చేరిన పోస్టులతో కలిపి మొత్తం పోస్టుల సంఖ్య 783కి చేరింది. గ్రూప్‌-3 కింద అనుమతించిన 1,373 పోస్టులకు అదనంగా మరో వందకు పైగా చేరనున్నాయి. ఈ రెండు ప్రకటనలను వెలువరించేందుకు టీఎస్‌పీఎస్సీ బోర్డు ఇప్పటికే ఆమోదం తెలిపింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని