TSPSC: నా భర్తపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగిస్తున్నారు: హైకోర్టులో నిందితుడి భార్య పిటిషన్‌

టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీకేజీ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న నిందితుడి భార్య హైకోర్టులో పిటిషన్‌ వేశారు. తన భర్తపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగిస్తున్నారని.. వెంటనే ఆయనకు వైద్య పరీక్షలు చేయించాలని ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు.

Updated : 20 Mar 2023 16:00 IST

హైదరాబాద్‌: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC)లో పేపర్‌ లీకేజీ (paper Leak) కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న నిందితుడు రాజశేఖర్‌పై పోలీసులు థర్డ్‌ డిగ్రీ ప్రయోగిస్తున్నారంటూ ఆయన భార్య సుచరిత ఆరోపించారు. తన భర్తకు వైద్య పరీక్షలు చేయించాలని కోరుతూ ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాజశేఖర్‌రెడ్డిని కస్టడీకి తీసుకునే ముందు వైద్య పరీక్షలు చేయించామని పోలీసు శాఖ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కస్టడీ ముగిసిన తర్వాత కోర్టులో హాజరుపరిచే ముందు మరోసారి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని కోర్టుకు వివరించారు. కస్టడీకి ఇచ్చే ముందు నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకే విచారణ జరుగుతుందని పేర్కొన్నారు. వాదనలు విన్న హైకోర్టు.. పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ విషయంలో ఇంకేమైనా సమస్యలుంటే నాంపల్లి కోర్టును ఆశ్రయించాల్సిందిగా పిటిషనర్‌కు ఉన్నత న్యాయస్థానం సూచించింది.

సీడీపీవో పరీక్ష కూడా రద్దు చేయాలి: ఓయూ జేఏసీ

మరోవైపు టీఎస్‌పీఎస్సీ కార్యాలయం వద్ద ఉస్మానియా జేఏసీ ఆందోళనకు దిగింది. గ్రూప్‌-1 తర్వాత జరిగిన చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ (సీడీపీవో) పరీక్ష కూడా రద్దు చేయాలని డిమాండ్‌ చేసింది. గ్రూప్‌-1 తర్వాత జరిగిన ఈ పరీక్షను ఎందుకు రద్దు చేయలేదని ప్రశ్నించింది. సీడీపీవో పేపర్‌ కూడా లీకేజీ అయ్యిందని ఓయూ జేఏసీ నాయకులు అనుమానం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని