Telangana news: బొప్పాయి పండ్లు ఇవ్వలేదని బస్సు ఎక్కించుకోకపోవడం అవాస్తవం!

బొప్పాయి పండ్లు ఉచితంగా ఇవ్వనందుకు ఆర్టీసీ డ్రైవర్‌ బస్సు ఎక్కించుకోలేదని ఓ రైతు ఆందోళన చేసినట్లు ప్రసార మాద్యమాల్లో వార్తలు వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. ..

Published : 31 Jan 2022 01:15 IST

వైరల్‌గా మారిన  రైతు ఆందోళన.. వివరణ ఇచ్చిన ఆర్టీసీ

నాగర్‌కర్నూల్‌: బొప్పాయి పండ్లు ఉచితంగా ఇవ్వనందుకు ఆర్టీసీ బస్సు ఎక్కించుకోలేదని ఓ రైతు ఆందోళన చేసినట్లు ప్రసార మాధ్యమాల్లో వార్త వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లా, పెద్దకొత్తపల్లి మండలం మారేడు దిన్నె గ్రామం సమీపంలో జరిగిందని, ఆర్టీసీ డ్రైవర్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించాడంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే, ఇదంతా అవాస్తవమని, గోపయ్య అనే రైతు ఉద్దేశపూర్వకంగానే ఈ విధంగా ప్రచారం చేశాడని అచ్చంపేట ఆర్టీసీ డిపో మేనేజర్‌ వివరణ ఇచ్చారు.

‘‘సదరు వ్యక్తి రోజూ ఆర్టీసీ బస్సులో కొల్లాపూర్‌కు బొప్పాయి పండ్లు తీసుకెళ్లడం వాస్తవం. శుక్రవారం కూడా పండ్ల పెట్టెలు బస్సులో వేస్తూ, తనకు రావడానికి కుదరదని, కొల్లాపూర్‌లో తన వాళ్లు దించుకుంటారని చెప్పాడు. అందుకు బస్సు సిబ్బంది ఒప్పుకోలేదు. మనిషి వెంట వస్తేనే సరకును అనుమతించాలి, లేదంటే కార్గో ద్వారానే రవాణా చేసుకోవాలని చెప్పారు. దీంతో గోపయ్య కావాలనే లోకల్ మీడియాలో ప్రచారం చేయించారు. బొప్పాయి పండ్లు ఇవ్వలేదని డ్రైవర్ తిరస్కరించారనడం పూర్తిగా అవాస్తవం’’ అని డిపోమేనేజర్‌ తెలిపారు.

ఇంతకీ ఏం జరిగింది!

మారేడు మాన్ దిన్నె.. నల్లమల అడవి సమీపంలోని మారుమూల గ్రామం. కేవలం ఒకే ఒక్క బస్సు వెళుతుంది. ఆ గ్రామానికి చెందిన రైతు గోపయ్య తన వ్యవసాయ పొలంలో పండించిన బొప్పాయి పండ్లను నిత్యం కొల్లాపూర్ పట్టణానికి బస్సులో తీసుకువెళ్లి, అమ్ముకుని జీవనం సాగిస్తున్నాడు. రోజూలాగానే శుక్రవారం బొప్పాయి పండ్లను బస్సులో తీసుకువెళ్లేందుకు రోడ్డుపై పెట్టగా.. డ్రైవర్‌ ఎక్కించుకోలేదు. దీంతో గోపయ్య ఆ బస్సు కొల్లాపూర్ నుండి తిరిగి గ్రామానికి వస్తున్న సమయంలో రోడ్డుపై బొప్పాయి పండ్లతోపాటు బైఠాయించి నిరసన వ్యక్తం చేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని