TSRTC: వెయిటింగ్‌ ఎందుకు దండగా.. టీఎస్‌ఆర్టీసీ ఉండగా..: సజ్జనార్‌

సంక్రాంతి పండగ దృష్ట్యా హైదరాబాద్‌ నుంచి సొంతూళ్లకు వెళ్తున్న వారితో హైదరాబాద్‌ - విజయవాడ జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది. టోల్‌ ఫ్లాజాల వద్ద ఏర్పడిన రద్దీపై టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ స్పందించారు.

Published : 13 Jan 2023 10:58 IST

హైదరాబాద్‌: సంక్రాంతి పండగ దృష్ట్యా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సెలవులు ప్రకటించడంతో హైదరాబాద్‌ నుంచి సొంత వాహనాల్లో భారీగా ప్రజలు స్వగ్రామాలకు తరలివెళ్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌ - విజయవాడ జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది. రద్దీ దృష్ట్యా ఒక్క విజయవాడ మార్గంలోనే జీఎంఆర్‌ సంస్థ అదనంగా 10 టోల్‌ ప్లాజాలు ఏర్పాటు చేసినప్పటికీ రద్దీ మాత్రం తగ్గడం లేదు. చౌటుప్పల్‌ పరిధిలోని పంతంగి టోల్‌ ప్లాజా వద్ద అర కిలోమీటర్ మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ఫాస్ట్‌ట్యాగ్‌ ఉన్పప్పటికీ ప్రయాణికులకు నిరీక్షణ తప్పడం లేదు.

రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని టోల్‌ ప్లాజాల వద్ద పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోవడంపై టీఎస్‌ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ స్పందించారు. ‘‘సొంత వాహనాల్లో ఊళ్లకు వెళ్తూ టోల్‌ ప్లాజాల వద్ద సమయాన్ని వృథా చేసుకోవద్దు. గంటల తరబడి టోల్‌ ప్లాజాల వద్ద నిరీక్షించవద్దు. టీఎస్‌ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించండి. టోల్‌ ప్లాజాల వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక లేన్ల ద్వారా వేగంగా గమ్యస్థానాలకు చేరుకోండి. ప్రయాణికులను ఆర్టీసీ సిబ్బంది క్షేమంగా సొంతూళ్లకు చేర్చుతారు’’ అని సజ్జనార్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని