Omicron: ఒమిక్రాన్‌ కారణంగానే దేశంలో కేసుల సునామీ..!

ఒమిక్రాన్‌ వేరియంట్‌ కారణంగానే దేశంలో కొవిడ్‌ కేసుల సునామీ మొదలైనట్లు తెలుస్తోందని కొవిడ్‌ వర్కింగ్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ ఎన్‌కే అరోఢా పేర్కొన్నారు......

Updated : 12 Jan 2022 01:45 IST

పేర్కొన్న కొవిడ్‌ వర్కింగ్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ ఎన్‌కే అరోఢా

దిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అయితే ఒమిక్రాన్‌ కారణంగానే దేశంలో కొవిడ్‌ కేసుల సునామీ మొదలైనట్లు తెలుస్తోందని నేషనల్‌ టెక్నికల్‌ ఆడ్వైజరీ గ్రూప్‌ ఆన్‌ ఇమ్యూనైజేషన్‌ (NTAGI)కి చెందిన కొవిడ్‌ వర్కింగ్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ ఎన్‌కే అరోఢా పేర్కొన్నారు. జీనోమ్ సీక్వెన్సింగ్‌ కోసం పంపిన శాంపిల్స్‌లో ఓమిక్రాన్ వేరియంట్‌తో పాటు, దాని ఉపరకం BA.1 కేసులే అధికంగా బయటపడుతున్నట్లు శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారని అరోఢా వెల్లడించారు. అయితే ఈశాన్య రాష్ట్రాలతోపాటు, తమిళనాడులోని కొన్ని జిల్లాల్లో ఒమిక్రాన్‌ వ్యాప్తి ప్రస్తుతానికి ఎక్కువగా లేదని.. అక్కడ ఇంకా డెల్టానే  ఎక్కువగా వ్యాప్తిలో ఉన్నట్టు తెలిపారు.

దేశంలో కేసుల విజృంభణపై అరోఢా మరింత సమాచారం అందించారు. ‘గత మే, జూన్‌, జులై నెలల్లో దేశంలో 80-90 కేసులు డెల్టా వేరియంట్‌వే. అక్టోబర్‌-నవంబర్‌లో డెల్టా కేసులు 40 శాతానికి తగ్గిపోగా.. డెల్టా ప్లస్‌ కేసులు 50-60 శాతానికి ఎగబాకాయి. అయితే డిసెంబర్‌ రాగానే ఒమిక్రాన్‌ వ్యాప్తి మొదలైంది. దిల్లీ, ముంబయి, కోల్‌కతా పుణె, అహ్మదాబాద్ వంటి నగరాల్లో కొత్త వేరియంట్‌ వ్యాప్తి దాదాపు 75 శాతానికి చేరుకున్నట్లు జీనోమిక్‌ సర్వేలెన్స్‌ వెల్లడిస్తోంది’ అని ఓ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

కొత్త వేరియంట్‌ కారణంగా మరణాల శాతం తక్కువగా ఉన్నట్లు కొవిడ్‌ వర్కింగ్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ తెలిపారు. ‘ఒమిక్రాన్‌ పుట్టిన దక్షిణాఫ్రికాలోకానీ, అది అత్యధికంగా వ్యాప్తి చెందిన యూకేలో కానీ మరణాల రేటు చాలా తక్కువగానే ఉంది. గత కొద్దిరోజులుగా భారత్‌లోనూ అధిక వ్యాప్తే కనిపిస్తున్నప్పటికీ మరణాలు తక్కువగానే సంభవిస్తున్నాయి. వైరస్‌తో ఆసుపత్రుల్లో చేరుతున్న వారిలో.. కేన్సర్‌, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల సమస్యలు, మూత్రపిండాల రుగ్మతతో బాధపడుతున్నవారే అధికంగా ఉన్నారు. వారిలో కొందరు ఐసీయూలో చికిత్స పొందుతుండగా మరికొందరు మరణిస్తున్నారు’ అని వివరించారు. ఓ వారం తర్వాత ఈ అంశంపై మరింత అవగాహన వస్తుందన్నారు.

వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు పలు రాష్ట్రాలు చర్యలు చేపడుతున్నాయి. రాత్రి కర్ఫ్యూ, వారాంతపు లాక్‌డౌన్‌ విధిస్తున్నాయి. అయితే వైరస్ వ్యాప్తిని కట్టడిచేయడంలో ఈ తరహా చర్యలు ఏమాత్రం ప్రభావం చూపుతాయని కొందరు నిపుణులు ప్రశ్నిస్తుండగా.. అరోఢా వాటికి సమాధానమిచ్చారు. రాష్ట్రంలో ఒకరోజు అన్ని కార్యకలాపాలు ఆగిపోతే, వైరస్ వ్యాప్తి 15-16 శాతం తగ్గిపోతుందని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు