TTD: ఆ పరిస్థితిని మేం ఊహించే సిద్ధమైతే మాపైనే ఆరోపణలా?: ధర్మారెడ్డి

టైమ్‌ స్లాట్‌ వల్ల భక్తులకు చాలా త్వరగా దర్శనాలు కల్పించామని తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి అన్నారు. ఈనెల 9, 10, 11 తేదీలకు సంబంధించి ఒకేరోజు టోకెన్లను పంపిణీ చేసినట్లు చెప్పారు.

Updated : 13 Apr 2022 14:28 IST

తిరుమల: టైమ్‌ స్లాట్‌ వల్ల భక్తులకు త్వరగా శ్రీవారి దర్శనం కల్పించామని తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి అన్నారు. ఈనెల 9, 10, 11 తేదీలకు సంబంధించి ఒకేరోజు టోకెన్లను పంపిణీ చేసినట్లు చెప్పారు. రెండు రోజుల విరామం అనంతరం కౌంటర్లు ఓపెన్‌ చేయాలని భావించామని.. వారాంతాల్లో దర్శనానికి వచ్చే వారి సంఖ్య పెరిగిందన్నారు. తిరుమలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ధర్మారెడ్డి మాట్లాడారు.

మొత్తం మూడు కౌంటర్లు కలిపి 18 నుంచి 20వేల మంది భక్తులు వచ్చారని ఆయన చెప్పారు. రోజుకు 35వేల చొప్పున దర్శన టోకెన్లు ఇచ్చేలా ఏర్పాట్లు చేశామన్నారు. భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తున్నారని తెలిసి కౌంటర్లు మూసేశామని.. అక్కడికే తిరుమల బస్సులను పంపించామని వివరించారు. టోకెన్లు లేకున్నా శ్రీవారిని దర్శించుకునే ఏర్పాట్లు చేశామని ధర్మారెడ్డి తెలిపారు. ముందుగానే వైకుంఠం-2 కాంప్లెక్స్‌ను సిద్ధం చేశామన్నారు. అన్ని సమస్యలనూ అధిగమించినందునే సాఫీగా దర్శనాలు సాగాయని చెప్పారు.

ముందు సిద్ధంగా ఉన్నందునే అరగంటలో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించామని ధర్మారెడ్డి తెలిపారు. తాగునీరు, భోజనం, ఏసీలు, టీవీలు అన్నీ సిద్ధం చేశామని చెప్పారు. ఆ పరిస్థితిని మేం ఊహించే సిద్ధమైతే తమపై ఆరోపణలు చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు రకరకాల ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నామని ధర్మారెడ్డి వివరించారు. తితిదే అధికారుల నిర్లక్ష్యం అంటూ వ్యాఖ్యలు చేయొద్దని.. తమపై విమర్శలను ఖండిస్తున్నట్లు ఆయన చెప్పారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని