TTD: తిరుమలలో డ్రోన్ దృశ్యాల కలకలం.. స్పందించిన తితిదే ఛైర్మన్ సుబ్బారెడ్డి

తిరుమలలో డ్రోన్‌ కెమెరాతో చిత్రీకరించిన ఇన్‌స్టాగ్రామ్‌ రీల్‌ హైదరాబాద్‌కు చెందిన ఓ సంస్థ సామాజిక మాధ్యమాల్లో ప్రసారం చేసినట్లు గుర్తించామని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. దీనిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాల్సిందిగా ఆదేశించినట్లు చెప్పారు.

Updated : 21 Jan 2023 15:07 IST

తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని డ్రోన్‌ కెమెరాతో చిత్రీకరించిన ఇన్‌స్టాగ్రామ్‌ రీల్‌ శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో వ్యాపించడం కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. డ్రోన్‌ కెమెరాతో చిత్రీకరించిన ఇన్‌స్టాగ్రామ్‌ రీల్‌ హైదరాబాద్‌కు చెందిన సంస్థ సామాజిక మాధ్యమాల్లో ప్రసారం చేసినట్లు గుర్తించామన్నారు. సదరు సంస్థపై క్రిమినల్‌ కేసు నమోదు చేస్తామన్నారు. పటిష్ఠ భద్రత ఉన్న ఆలయంపై డ్రోన్‌తో చిత్రీకరించేందుకు అవకాశం లేదన్నారు. పాత చిత్రంతో యానిమేట్‌ చేశారా? అనే కోణంలో పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు సుబ్బారెడ్డి చెప్పారు. డ్రోన్‌ చిత్రాలు, దృశ్యాలపై భక్తులు ఆందోళన చెందాల్సిన పని లేదని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఆగమశాస్త్రం ప్రకారం శ్రీవారి ఆలయంపై ఎలాంటి వస్తువులు ఎగరడానికి వీలులేదనే నిబంధన ఉంది. బేడి ఆంజనేయ స్వామి ఆలయం నుంచి పశ్చిమ మాఢవీధి వరకు దృశ్యాలు చిత్రీకరించారు. శ్రీవారి ఆనంద నిలయం, ఆనంద నిలయ గోపురాలకు దగ్గరగా చిత్రీకరణ చేశారు. అయితే, నో ఫ్లై జోన్‌గా ఉన్న తిరుమలలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని