TTD: వీఐపీ బ్రేక్‌ దర్శన సమయంలో మార్పులు: తితిదే

వీఐపీ బ్రేక్‌ దర్శన సమయంలో మార్పు చేయాలని నిర్ణయించామని తితిదే ఛైర్మన్‌ వై.వి సుబ్బారెడ్డి తెలిపారు. డిసెంబరు 1 నుంచి ప్రయోగాత్మకంగా బ్రేక్‌ దర్శన సమయాన్ని మారుస్తామన్నారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు వీఐపీ బ్రేక్‌ దర్శన సమయాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలిస్తామన్నారు.

Published : 28 Oct 2022 15:12 IST

తిరుమల: నవంబర్ 1వ తేదీ నుంచి తిరుపతిలో సర్వదర్శన టైంస్లాట్‌ దర్శన టోకెన్లు జారీ చేస్తామని తితిదే ఛైర్మన్‌ వై.వి. సుబ్బారెడ్డి తెలిపారు. తిరుపతిలో మూడు ప్రదేశాల్లో సర్వదర్శన టికెట్లు జారీ చేస్తామని చెప్పారు. తిరుపతి అలిపిరి వద్ద తితిదే ఉద్యోగులకు రూ.54 లక్షలతో నిర్మించిన ద్విచక్ర వాహనాల పార్కింగ్ కేంద్రాన్ని ఈవో ధర్మారెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం తిరుమల అన్నమయ్య భవనంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోజూ 20వేల నుంచి 25 వేల సర్వదర్శన టోకెన్లు జారీ చేస్తామని తెలిపారు. మంగళ, గురు, శుక్రవారాల్లో 15వేల టోకెన్లు జారీ చేస్తామన్నారు. టికెట్లు లేని భక్తులు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ ద్వారా స్వామివారిని దర్శించుకోవచ్చని తెలిపారు. 

వీఐపీ బ్రేక్‌ దర్శన సమయంలో మార్పు చేయాలని నిర్ణయించామన్నారు. డిసెంబరు 1 నుంచి ప్రయోగాత్మకంగా బ్రేక్‌ దర్శన సమయాన్ని మారుస్తామన్నారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు వీఐపీ బ్రేక్‌ దర్శన సమయాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలిస్తామన్నారు. క్షురకులను నిఘా సిబ్బంది ఇబ్బంది పెట్టలేదని తితిదే ఈవో ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలో నిఘా విభాగం ఉండేది అవినీతిని అరికట్టేందుకేనని స్పష్టం చేశారు. క్షురకుల ధర్నా వల్ల చాలా మంది ఇబ్బందిపడ్డారని.. భక్తులను ఇబ్బందికి గురిచేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. క్షురకులకు ఏదైనా సమస్య ఉంటే అధికారుల దృష్టికి తేవాలని తితిదే ఈవో కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, తితిదే పాలక మండలి సభ్యుడు అశోక్ కుమార్, జేఈవో సదాభార్గవి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని