Updated : 11 Aug 2022 17:27 IST

TTD: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకు పెద్దపీట: ఈవో

తిరుమల: శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈనెల 27 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో భక్తులకు సంతృప్తికరంగా స్వామివారి దర్శనంతో పాటు వాహనసేవలు వీక్షించే అవకాశం కల్పించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్టు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవన్‌లో గురువారం నిర్వహించిన డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమంలో భక్తులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.

‘‘సెప్టెంబరు 27 నుంచి అక్టోబరు 5 వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇందులో ప్రధానంగా సెప్టెంబరు 27న ధ్వజారోహణం, అక్టోబరు 1న గరుడ సేవ, అక్టోబర్‌ 2న స్వర్ణరథం, 4న రథోత్సవం, 5న చక్రస్నానం నిర్వహిస్తాం. కరోనా కారణంగా రెండేళ్ల తరువాత మాడవీధుల్లో శ్రీవారి బ్రహ్మోత్సవ వాహనసేవలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ సర్వదర్శనం మాత్రమే ఉంటుంది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, వృద్ధులు, వికలాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రులకు ఇచ్చే అన్ని రకాల ప్రివిలేజ్డ్‌ దర్శనాలు రద్దు చేశాం. 

బ్రహ్మోత్సవాల్లో తొలి రోజు సీఎం జగన్‌ రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. తొలి రోజు ధ్వజారోహణం కారణంగా రాత్రి 9గంటలకు పెద్దశేష వాహనసేవ ప్రారంభమవుతుంది. మిగతా రోజుల్లో ఉదయం 8గంటల నుంచి 10గంటల వరకు, రాత్రి 7గంటల నుంచి 9గంటల వరకు వాహనసేవలు నిర్వహిస్తాం. కరోనా కారణంగా రెండేళ్ల పాటు నిలిచిపోయిన అఖండ హరినామ సంకీర్తనం కార్యక్రమం ఆగస్టు 1న తిరుమలలో తిరిగి ప్రారంభమైంది. 2007లో అఖండ హరినామ సంకీర్తన కార్యక్రమాన్ని తితిదే ప్రారంభించింది. బర్డ్‌ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న 3 వార్డులను అభివృద్ధి చేసి రోగుల కోసం మరో 100 పడకలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. తిరుమలలో గదులు పొందిన భక్తులకు ఎదురయ్యే సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన కంప్లైంట్‌ ట్రాకింగ్‌ సిస్టం సత్ఫలితాలను ఇస్తోంది. ఈ విధానాన్ని తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం, గోవిందరాజస్వామి సత్రాల్లోనూ అమలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నాం’’ అని ఈవో తెలిపారు. 

నవీ ముంబయిలో రూ.200 కోట్లతో శ్రీవారి ఆలయం  

నవీ ముంబయిలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ భూమి పూజ ఈనెల 21న నిర్వహించనున్నట్టు తితిదే ఈవో ధర్మారెడ్డి తెలిపారు. కోస్టల్‌ కారిడార్‌ పక్కనే నవీ ముంబయి సమీపంలోని ఉల్వే వద్ద మహారాష్ట్ర ప్రభుత్వం 10 ఎకరాల భూమిని కేటాయించిందన్నారు. రానున్న రెండేళ్లలో ఆ ప్రాంతం కేంద్రం బిందువుగా మారుతుందన్నారు. తిరుమల ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు ఆధ్వర్యంలో వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా ఆలయ నిర్మాణానికి సంబంధించిన క్రతువులు ప్రారంభించారన్నారు. ప్రధాన ఆలయం నిర్మాణ వ్యయం రూ.100 కోట్లు కాగా, మిగిలిన నిర్మాణాలు మరో రూ.100 కోట్లు అవుతాయని అంచనా వేసినట్టు చెప్పారు. శ్రీవారి ఆలయ నిర్మాణానికి అయ్యే మొత్తం వ్యయాన్ని రేమండ్‌ సంస్థ అధినేత గౌతమ్‌ సింఘానియా విరాళంగా ఇవ్వనున్నట్టు ఈవో వివరించారు.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts