TTD: వారికి 10 రోజుల టోకెన్లు ఒకేసారి అందిస్తాం: జవహర్‌ రెడ్డి

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి సన్నిధిలో వైకుంఠ ఏకాదశికి విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఈవో జవహర్‌ రెడ్డి తెలిపారు

Updated : 07 Jan 2022 20:16 IST

వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై తితిదే ఈవో సమీక్ష

తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి సన్నిధిలో వైకుంఠ ఏకాదశికి విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఈవో జవహర్‌ రెడ్డి తెలిపారు. తిరుమ‌ల‌లో జ‌న‌వ‌రి 13న వైకుంఠ ఏకాద‌శి, 14న ద్వాద‌శి సంద‌ర్భంగా భ‌క్తుల సౌక‌ర్యార్థం అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారుల‌ను ఆదేశించారు. తిరుమ‌ల అన్నమయ్య భవన్‌లో అన్ని విభాగాల అధికారుల‌తో ఈవో స‌మీక్ష నిర్వహించారు.

స‌మీక్ష అనంత‌రం జవహర్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘జ‌న‌వ‌రి 13 నుంచి 22వ తేదీ వ‌ర‌కు 10 రోజుల పాటు భ‌క్తుల‌కు వైకుంఠ ద్వార దర్శనం క‌ల్పిస్తాం. వైకుంఠ ఏకాద‌శి రోజున కైంక‌ర్యాల అనంత‌రం ఉద‌యం 1.45 గంట‌ల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తాం. భ‌క్తుల సౌక‌ర్యార్థం ఇప్పటికే ప్రత్యేక ప్రవేశ దర్శనం, సర్వదర్శనం టైంస్లాట్‌, శ్రీ‌వాణి, వ‌ర్చువ‌ల్ సేవా టికెట్లను ఆన్‌లైన్‌లో విడుద‌ల చేశాం. గ‌తేడాది లాగానే తిరుప‌తిలోని 5 ప్రాంతాల్లో స్థానికుల కోసం సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లు జారీ చేస్తాం. ఒమిక్రాన్ వ్యాప్తి నేప‌థ్యంలో ముందు వ‌చ్చిన వారికి ముందు ప్రాతిప‌దిక‌న తిరుప‌తి స్థానికుల‌కు మాత్రమే 10 రోజుల టోకెన్లు ఒకేసారి అందిస్తాం. తిరుమ‌ల‌లో యాత్రికులు బ‌స చేసేందుకు దాదాపు 7,500 పైగా గ‌దులు ఉండ‌గా.. ప్రస్తుతం 1,300 పైగా గ‌దుల పునరుద్ధరణ ప‌నులు జ‌రుగుతున్నాయి. ఈ కార‌ణంగా భ‌క్తులు వీలైనంత వ‌ర‌కు తిరుప‌తిలోనే గ‌దులు తీసుకొని తిరుమ‌ల‌కు వ‌చ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలి.

వైకుంఠ ఏకాదశి రోజున ఉద‌యం స్వర్ణ ర‌థోత్సవాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాల‌ని, ద్వాద‌శి నాడు ఉద‌యం 5 నుంచి 6 గంట‌ల వ‌ర‌కు చక్రస్నానం ఏకాంతంగా జరపాలని నిర్ణయించాం. 6 లక్షల ల‌డ్డూల బ‌ఫ‌ర్ స్టాక్ ఉంచుకుంటాం. ల‌డ్డూ కాంప్లెక్స్‌లో ప్రస్తుతం ఉన్న 31 కౌంట‌ర్లను 41కి పెంచుతాం. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో భ‌క్తులు వ్యాక్సినేష‌న్ సర్టిఫికెట్ లేదా దర్శనానికి 48 గంటల ముందు చేసుకున్న ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్ష నెగిటివ్ సర్టిఫికెట్ తప్పనిస‌రిగా తీసుకురావాల్సి ఉంటుంది. భ‌క్తులు మాస్కులు ధ‌రించి భౌతిక‌దూరం పాటించాలి. తితిదే ఉద్యోగులు, వేలాది మంది సహ భక్తుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని భక్తులు తితిదే విజిలెన్స్, సెక్యూరిటీ సిబ్బందికి స‌హ‌క‌రించాలి’’ అని ఈవో కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని