TTD: తిరుమలలో తొలిసారి హనుమజ్జయంతి ఉత్సవాలు.. తేదీలు ఖరారు

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి సన్నిధిలో తొలిసారి హనుమజ్జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నారు. తిరుమల అన్నమయ్య భవనంలో ఉత్సవాల

Published : 08 May 2022 02:26 IST

తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి సన్నిధిలో తొలిసారి హనుమజ్జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నారు. తిరుమల అన్నమయ్య భవనంలో ఉత్సవాల ఏర్పాట్లపై తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 25 నుంచి 29 వరకు హనుమజ్జయంతి ఉత్సవాలను తిరుమలలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలోని అంజనాద్రి జాపాలి, నాదనీరాజన వేదిక, వేదపాఠశాలలో ఉత్సవాలు జరగనున్నట్లు చెప్పారు. మే 29న ధర్మగిరి వేద‌పాఠ‌శాల‌లో సంపూర్ణ సుంద‌ర‌కాండ అఖండ పారాయ‌ణం నిర్వహించేందుకు ఆయా విభాగాల అధికారులు ముంద‌స్తు ఏర్పాట్లు చేయాల‌న్నారు. ఉత్సవాలు మొదటిసారి నిర్వహిస్తున్నందున ఘనంగా జరపాలని అధికారులను ఆదేశించారు. ఉత్సవాలు జరుగుతున్న రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్వామివారి భక్తుల కార్యక్రమాలను వీక్షించేందుకు వీలుగా ఎస్‌వీబీసీ నాలుగు ఛానెళ్ల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు ధర్మారెడ్డి వెల్లడించారు.

అలా తిరుమలకు రావొద్దు.. భక్తులకు తితిదే విజ్ఞప్తి..

శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు వారి వాహనాలకు వ్యక్తుల ఫొటోలు, రాజకీయ పార్టీల జెండాలు, అన్యమత చిహ్నాలతో తిరుమలకు రావొద్దని తితిదే విజ్ఞప్తి చేసింది. అలాంటి వాహనాలను అలిపిరి వద్దే నిలిపివేయనున్నట్లు తెలిపింది. ఈ విధానాన్ని తితిదే ఎన్నో దశాబ్దాలుగా అనుసరిస్తుందని పేర్కొంది. అయితే ఈ మధ్యకాలంలో అవగాహనలేమితో వారి వాహనాలపై వ్యక్తుల ఫొటోలు, పార్టీ జెండాలు, అన్యమత చిహ్నాలతో వస్తున్నారని వెల్లడించింది. వాహనదారులకు విషయం వివరించి విజిలెన్స్‌ సిబ్బంది వాటిని తొలగిస్తున్నారని పేర్కొంది. ఇకపై వాహనాల్లో తిరుమలకు వచ్చే భక్తులు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా తితిదే విజ్ఞప్తి చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని