TTD: దేశవ్యాప్తంగా శ్రీవారి కల్యాణోత్సవాలు నిర్వహిస్తాం: వైవీ సుబ్బారెడ్డి

 శ్రీవారి కల్యాణోత్సవాలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తామని తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. నెల్లూరులో స్వామివారి వైభవోత్సవాలు...

Published : 24 Sep 2022 02:17 IST

తిరుమల: శ్రీవారి కల్యాణోత్సవాలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తామని తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. నెల్లూరులో స్వామివారి వైభవోత్సవాలు నిర్వహించామని.. అలాగే, చెన్నైలో శ్రీవారి కల్యాణోత్సవాలు నిర్వహించినట్టు చెప్పారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అమెరికాలో తొమ్మిది రాష్ట్రాల్లో శ్రీవారి కల్యాణోత్సవాలు జరిపాం. ఐరోపా దేశాల్లోనూ కల్యాణోత్సవాలు చేయాలని కోరుతున్నారు. సీఎం ఆదేశాలతో ఐరోపాలో కల్యాణోత్సవం నిర్వహిస్తాం. ఐరోపాలో వివిధ దేశాల్లో పది చోట్ల కల్యాణోత్సవాలు నిర్వహిస్తాం. అక్టోబర్‌ 17 నుంచి నవంబర్‌ 13 వరకు కల్యాణోత్సవాలు నిర్వహిస్తాం. తిరుమలలో ప్లాస్టిక్‌ పూర్తిగా నిషేధించి ఒకటిన్నర సంవత్సరం పూర్తయింది. 2023 కొత్త ఏడాది వారధి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుంది’’ అన్నారు. 

తితిదే ధర్మకర్తల మండలి భేటీ రేపు..

శనివారం తితిదే ధర్మకర్తల మండలి సమావేశం జరగనుంది. శ్రీవారి బ్రహ్మోత్సవాల నిర్వహణపై ప్రధానంగా చర్చించనున్నారు. లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చే గరుడ సేవపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీస్‌, విజిలెన్స్‌తో బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. తిరుమలలో వసతి సమస్య పరిష్కారంపై బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. సర్వదర్శనం క్యూలైన్ల నిర్మాణానికి రూ.33కోట్లు మంజూరు చేయనుంది. తితిదే ఇంజినీరింగ్‌ విభాగంలో ఉన్న ఖాళీ పోస్టుల భర్తీపై నిర్ణయం తీసుకోనున్నారు. వకుళామాత ఆలయాన్ని తితిదే పరిధిలోకి తెచ్చే అంశంతో పాటు.. హుండీ ద్వారా వచ్చిన విదేశీ కరెన్సీ మార్పిడిపై నిర్ణయం తీసుకోనున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని