
E-commerce: పేరుకు తగ్గట్టే డెలివరీ!
ఇంటర్నెట్ డెస్క్: ఆన్లైన్లో ఏదైనా ఆర్డర్ చేసినప్పుడు.. దానికి బదులు మరో వస్తువు రావడం, ఒక్కోసారి ఖాళీ బాక్స్ దర్శనమివ్వడం వంటి చేదు అనుభవాలు కొంతమందికి ఎదురయ్యే ఉంటాయి. అలాంటి అనుభవమే ఓ బుల్లితెర నటుడికి ఎదురైంది. అయితే, ఆయన ఆర్డర్ చేసిన వస్తువు పేరుకు తగ్గట్టే డెలివరీ ఉండటం గమనార్హం.
‘అనుపమ’ అనే సీరియల్లో నటిస్తోన్న పరాస్ కల్నావత్ ఇటీవల నథింగ్ ఇయర్ - 1 (Nothing Ear-1) ఇయర్‌ఫోన్స్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్ చేశాడు. ఆర్డర్ డెలివరీ అయ్యాక తెరిచి చూస్తే అందులో ఇయర్‌ఫోన్స్ కనిపించలేదు. బాక్స్ ఖాళీగా ఉండటంతో కంగుతిన్న పరాస్.. వెంటనే ట్విటర్ వేదికగా ఫ్లిప్‌కార్ట్‌పై అసహనం వ్యక్తం చేశాడు. ఖాళీ బాక్స్ ఫొటోను ట్విటర్లో పోస్టు చేసి ‘నేను నథింగ్ ఇయర్‌ఫోన్స్ ఆర్డర్ చేసే నాకు వచ్చింది నథింగ్(ఏమీలేదు). ఫ్లిప్‌కార్టు సేవలు దారుణంగా ఉన్నాయి. ఇలాగే కొనసాగితే ప్రజలు ఫ్లిప్‌కార్టులో కొనుగోలు చేయడం మానేస్తారు’’అని పేర్కొన్నాడు.
ఆ పోస్ట్ వైరల్ కావడంతో ఎట్టకేలకు ఫ్లిప్‌కార్ట్ సంస్థ స్పందించింది. ‘మీ ఆవేదనను అర్థం చేసుకున్నాం. మీ ఆర్డర్ వివరాలు పంపిస్తే.. సాయం చేస్తాం’’అని పరాస్ ట్వీట్‌కు సమాధానం ఇచ్చింది. కాగా.. పరాస్ ట్వీట్‌కు నెటిజన్లు స్పందిస్తూ.. తమకు ఇలాగే జరిగిందంటూ వారి అనుభవాలను పంచుకుంటున్నారు.