Heart Melts: చెల్లెళ్లే కాడెద్దులై..

ఎద్దులు కొనే స్తోమత లేని ఓ నిరుపేద సోదరుడు పొలం దున్నేందుకు తన ఇద్దరు చెల్లెళ్లనే కాడెద్దులుగా మార్చాడు. తమకున్న కొద్దిపాటి భూమిని సాగు చేసుకునేందుకు  ఆ సోదరీమణులు కాడెద్దుల్లా అరకను లాగారు....

Updated : 19 Jun 2021 19:27 IST

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఘటన

సెహోర్‌: ఎద్దులు కొనే స్తోమత లేని ఓ నిరుపేద సోదరుడు పొలం దున్నేందుకు తన ఇద్దరు చెల్లెళ్లనే కాడెద్దులుగా మార్చాడు. తమకున్న కొద్దిపాటి భూమిని సాగు చేసుకునేందుకు  ఆ సోదరీమణులు కాడెద్దుల్లా అరకను లాగారు. ఆ యువతుల కష్టం.. ఆ సోదరుడి తాపత్రయం.. చూసేవారిని కంటతడి పెట్టిస్తోంది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి సొంత జిల్లాలో జరిగిన ఈ హృదయ విదారక ఘటన మనసును ద్రవింపజేస్తోంది.

సాగు చేసేందుకు ఓ అన్న తన ఇద్దరు చెల్లెళ్లనే కాడెద్దులుగా మార్చిన ఘటన మధ్యప్రదేశ్‌లోని సెహోర్‌ జిల్లాలో జరిగింది. అష్టా మున్సిపాలిటీ పరిధిలోని నానక్‌పూర్‌ గ్రామంలో నివసిస్తున్న శైలేంద్ర కుష్వాహా.. ఎద్దులు కొనేందుకు ఆర్థిక స్తోమత లేక తన ఇద్దరు సోదరీమణులను కాడెద్దులుగా మార్చాడు. సోయాబీన్స్‌ పండించేందుకు దాదాపు నాలుగు ఎకరాల భూమిని ఇద్దరు చెల్లెళ్లు అరక లాగుతూ దున్నారు. మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ సొంత జిల్లా అయిన సెహోర్‌లో జరిగిన ఈ ఘటన అందరినీ కంటతడి పెట్టిస్తోంది.

తన తండ్రి పదేళ్ల క్రితం మరణించాడని.. అప్పటినుంచి తమ ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారిందని శైలేంద్ర కుష్వాహా తెలిపాడు. తండ్రి మరణించినప్పటి నుంచి తాను సంపాదిస్తేనే ఇల్లు గడుస్తోందన్నాడు. తల్లి, ఇద్దరు చెల్లెళ్లతో కలిసి తాను వ్యవసాయం చేస్తున్నానని కుష్వాహా వివరించాడు. పొలం దున్నేందుకు అవసరమైన  ఎద్దులు కొనేందుకు కూడా తమ వద్ద డబ్బులు లేవని.. గత్యంతరం లేకే తన చెల్లెళ్లతో పొలం దున్నిస్తున్నానని వాపోయాడు. కొన్నేళ్లుగా తన సోదరీమణులతో కలిసి ఇలాగే పొలం సాగుచేస్తున్నట్లు తెలిపాడు. ఇద్దరు చెల్లెళ్లతో కుష్వాహా పొలం దున్నుతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని