తెలంగాణకు కోటా పెంచుతాం: హర్షవర్దన్‌

తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పడుతోందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్షవర్దన్ సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రానికి కావాల్సిన ఆక్సిజన్‌, రెమ్‌డెసివిర్‌.....

Published : 12 May 2021 19:48 IST

టెలీకాన్ఫరెన్స్‌లో కేంద్రమంత్రి హామీ
రాష్ట్ర ప్రభుత్వం తరఫున పాల్గొన్న మంత్రి హరీశ్‌ రావు

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పడుతోందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్షవర్దన్ సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రానికి కావాల్సిన ఆక్సిజన్‌, రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు, వ్యాక్సిన్లు, టెస్టింగ్ కిట్లు, వెంటిలేటర్లు తదితర కరోనా సంబంధిత మందుల సామగ్రి కోటాను పెంచి సత్వరమే సరఫరా చేస్తామని రాష్ట్రానికి కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. ఈ మేరకు వివిధ రాష్ట్రాలతో బుధవారం వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. తెలంగాణ నుంచి సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు మంత్రి హరీశ్‌ రావు, ఇతర ఉన్నాతాధిరులు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, కట్టడికి తీసుకున్న చర్యలను హరీశ్‌రావు వివరించారు. రాష్ట్రానికి కావాల్సిన వ్యాక్సిన్లు, ఆక్సిజన్‌ తదితరాల కోటాను మరింతగా పెంచి సత్వరమే రాష్ట్రానికి సరఫరా అయ్యేలా చూడాలని కోరారు.

‘‘మొదటి వేవ్ కరోనా సందర్భంలో ఉన్న మౌలిక వసతులను రెండో వేవ్ వచ్చేసరికి రాష్ట్ర ప్రభుత్వం గణనీయంగా పెంచింది. అప్పుడు కేవలం 18,232 బెడ్లు మాత్రమే ఉంటే నేడు వాటి సంఖ్య 53,775కి పెరిగింది. సీఎం కేసీఆర్‌ ముందుచూపుతో 9,213గా ఉన్న ఆక్సిజన్‌ బెడ్లను 20,738కు, ఐసీయూ బెడ్లను 3,264 నుంచి 11,274కు ప్రభుత్వం పెంచింది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కేసీఆర్‌ ఆదేశాలతో వైద్యారోగ్యశాఖ డోర్ టు డోర్ కొవిడ్ పీవర్ సర్వేను నిర్వహిస్తోంది. అంగన్‌వాడీ, ఆశా వర్కర్లు, ఏఎన్ఎం సిబ్బందితో కూడిన 27,039 టీమ్‌లు ఇంటింటికీ వెళ్లి జ్వర పరీక్షలు నిర్వహిస్తున్నాయి’’ అని హరీశ్‌రావు కేంద్రమంత్రికి తెలిపారు. అనుమానితులకు కరోనా నియంత్రిత మందులతో కూడిన హెల్త్‌ కిట్లను ఉచితంగా అందజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం సత్ఫలితాలనిస్తోందన్నారు. 60 లక్షల ఇళ్లలో జ్వర పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. 

రాష్ట్రంలో కరోనా కట్టడికి నేటి నుంచి లాక్‌డౌన్‌ అమలౌతోందని హరీశ్‌ రావు చెప్పారు. తెలంగాణ మెడికల్ హబ్‌గా మారిన నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి  కరోనా బాధితుల రద్దీ విపరీతంగా పెరిగిందని కేంద్రమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ నుంచి కరోనా బాధితులు తెలంగాణకు వచ్చి వైద్యం పొందుతున్నారన్నారు. వారి వారి రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్‌గా రికార్డుల్లోకి ఎక్కిన వారు తెలంగాణకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్న నేపథ్యంలో కొవిడ్ పాజిటివ్ లెక్కల్లో తేడా వస్తోందని చెప్పారు. ఇది తెలంగాణ ప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారిందన్నారు. తెలంగాణకు జనాభా ప్రాతిపదిక కాకుండా, ఇతర రాష్ట్రాల పాజిటివ్ కేసులను కలుపుకొని మందులు, ఇక్సిజన్‌ ఇతరాల కేటాయింపులు జరపాలని మంత్రి కోరారు. తెలంగాణలో మందుల కొరత పెరగడానికి  ఈ లెక్కల్లో తేడా ప్రధాన కారణమని కేంద్రమంత్రికి హరీష్ రావు వివరించారు.

తెలంగాణకు కేటాయించిన 450 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను 600 మెట్రిక్ టన్నులకు పెంచాలని హరీశ్‌రావు కోరారు. ఒడిశా తదితర సుదూర ప్రాంతాల నుంచి కాకుండా, ఏపీ, మహారాష్ట్ర నుంచి ఆక్సిజన్‌ కేటాయింపులు చేయాలన్నారు. రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్ల కోటాను 20వేలకు పెంచాలని కోరారు. ఎయిర్ అంబులెన్సుల ద్వారా అత్యవసర చికిత్సకోసం ఇతర ప్రాంతాల నుంచి కరోనా బాధితులు తెలంగాణకు వస్తున్న నేపథ్యంలో టొసిలోజుమాబ్‌ ఇంజక్షన్లను 810 నుంచి 1500కు పెంచాలని చెప్పారు. తెలంగాణకు 2 లక్షల టెస్టింగ్ కిట్లు అవసరమున్న పరిస్థితుల్లో వాటిని తక్షణమే సరఫరా చేయాలన్నారు. రెండో డోస్ కొవిడ్ టీకాను సీఎం ఆదేశాల మేరకు నూటికి నూరుశాతం రాష్ట్రంలో అమలుపరుస్తున్నామని హరీశ్‌ రావు అన్నారు. ఈ నేపథ్యంలో మొదటి డోస్ కోసం 96 లక్షల వ్యాక్సిన్లు, రెండో డోస్ పూర్తి చేయడానికి 33 లక్షల వ్యా్క్సిన్లు.. మొత్తం కోటీ 29 లక్షల వ్యాక్సిన్లు అవసరం ఉందని తెలిపారు. ఈనెల చివరి నాటికి 10 లక్షల కొవిషీల్డ్‌, 3 లక్షల కొవాగ్జిన్‌ డోసులు తక్షణావసరమున్నదని, వెంటనే రాష్ట్రానికి సరఫరా చేయాలని కోరారు. 2వేల వెంటిలేటర్లు రాష్ట్రానికి అవసరమున్న నేపథ్యంలో తక్షణమే సరఫరా చేయాలని మంత్రి హరీశ్‌రావు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు. వీడియో కాన్పరెన్సు సందర్భంగా తెలంగాణ రాష్ట్రం చేసిన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి హర్షవర్దన్.. తప్పకుండా రాష్ట్ర అవసరాల రీత్యా తక్షణమే సరఫరాకు చర్యలు చేపడుతామని హామీ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని