తెలంగాణలో వాటర్‌ డ్రోమ్స్‌ ఏర్పాటు చేస్తాం: కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా

రెండేళ్లుగా విమానయాన రంగం ఒడిదొడుకులను ఎదుర్కొంటోందని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు.

Updated : 25 Mar 2022 15:39 IST

హైదరాబాద్‌: రెండేళ్లుగా విమానయాన రంగం ఒడిదొడుకులను ఎదుర్కొంటోందని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. ఒడిదొడుకుల నుంచి విమానయాన రంగం వేంగంగా పుంజుకుంటోందని చెప్పారు. బేగంపేటలో నిర్వహిస్తు్న్న వింగ్స్‌ ఇండియా ఏవియేషన్‌ సదస్సు రెండో రోజు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గత ఏడేళ్లలో విమానాశ్రయాల సంఖ్య భారీగా పెరిగిందని.. 66 విమానాశ్రయాలు ఏర్పాటు చేశామని చెప్పారు. దేశంలో ప్రస్తుతం విమానాశ్రయాల సంఖ్య 74 నుంచి 140కి చేరిందన్నారు. 

తెలంగాణలో ఎయిర్‌పోర్టులు, వాటర్‌ డ్రోమ్స్‌, హెలిప్యాడ్లను ఏర్పాటు చేస్తామని జ్యోతిరాదిత్య సింధియా చెప్పారు. ఇప్పటికే గుజరాత్‌లో హెలిప్యాడ్లు, ఎయిర్‌డ్రోమ్స్‌ ఏర్పాటు చేశామని వివరించారు. 2024-25 నాటికి ఎయిర్‌పోర్టుల సంఖ్యను 140 నుంచి 220కి పెంచుతామని కేంద్రమంత్రి తెలిపారు. విమానాశ్రయాల నిర్మాణం ఆర్థికవృద్ధి నడవాకు కీలకమని చెప్పారు.

మహిళలను ప్రోత్సహించాలి: గవర్నర్‌ తమిళిసై

మహిళలను ఏవియేషన్‌ వైపు ప్రోత్సహించాలని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. దేశీయ వ్యాక్సిన్‌ తీసుకున్నందుకు గర్వపడుతున్నానని.. ఏవియేషన్‌ ద్వారా విదేశాలకు మన వ్యాక్సిన్లు చేరుతున్నాయని చెప్పారు. టీకాలు, ఔషధాలు, మందుల పిచికారీలకు డ్రోన్‌ పాలసీ అవసరమని చెప్పారు. డ్రోన్ల ద్వారా గిరిజన ప్రాంతాల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. 

ఏవియేషన్‌ షోకు ఆతిథ్యమివ్వడం గర్వకారణం: ప్రశాంత్‌రెడ్డి

ఏవియేషన్‌ షోకు ఆతిథ్యం ఇవ్వడం హైదరాబాద్‌కు గర్వకారణమని తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ఏవియేషన్‌, ఏరోస్పేస్‌ సెక్టార్లు రాష్ట్రానికి ప్రాధాన్య రంగాలని చెప్పారు. ఫ్లయింగ్‌ ఫర్‌ ఆల్‌ విధానానికి కట్టుబడుతూ.. పాత విమానాశ్రయాలు పునరుద్ధరణ, గ్రీన్‌ఫీల్డ్‌, బ్రౌన్‌ ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని