Train accident: ‘కోరమాండల్‌’ కాస్త ముందొచ్చుంటే మరింత ఘోరం జరిగేది!

ఒడిశాలో రైలు ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. మూడు రైళ్లు ఎలా ఢీకొన్నాయి? అనే దానిపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ దుర్ఘటనపై రైల్వే కన్సల్టేటివ్ కమిటీ మాజీ సభ్యులు ఉప్పులూరి శశిధర్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

Updated : 03 Jun 2023 19:15 IST

గుంటూరు: ఒడిశా (Odisha)లోని బాలేశ్వర్‌ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం యావత్‌ దేశాన్ని తీవ్రంగా కలచివేసింది. ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. మూడు రైళ్లు ఎలా ఢీకొన్నాయనే దానిపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రైల్వే అధికారులు మాత్రం సిగ్నల్‌ లోపం కారణంగా కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ (Coromandel Express) గూడ్సు రైలు ఆగి ఉన్న లూప్‌లైన్‌లోకి వెళ్లడం వల్లే  ఘోరం జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు. ఈ దుర్ఘటనపై రైల్వే కన్సల్టేటివ్ కమిటీ మాజీ సభ్యులు ఉప్పులూరి శశిధర్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

‘‘ప్రమాదం జరిగిన స్టేషన్‌కు 6.56 గంటలకు కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ వచ్చింది. ప్రాథమిక నివేదిక, రైల్వేబోర్డు సేఫ్టీ వెబ్‌సైట్‌లో ఖరగ్‌పూర్‌ డివిజన్‌ అధికారులు అప్‌డేట్‌ చేసిన ప్రాథమిక సమాచారం బట్టి చూస్తే.. కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఆగకుండా మెయిన్‌లైన్‌ నుంచి వెళ్లేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. కానీ, రైలు మెయిన్‌ లైన్‌లో వెళ్లకుండా గూడ్స్‌ రైలు ఆగి ఉన్న లూప్‌ లైన్‌లోకి రావడం వల్లే  ప్రమాదం జరిగింది. అక్కడ టైమ్‌ ప్రకారం లోక్‌ మోటీవ్‌ ఆర్టీఎస్‌లో చూస్తే ఏ టైమ్‌కి ఎంత స్పీడ్‌లో రైలు వెళ్తుందనేది తెలుస్తుంది.   కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ జీరో సెకన్స్‌ రావటానికి 6గంటల 55 నిమిషాల 51 సెకన్ల టైమ్‌లోకి వచ్చింది. అప్పటి వరకు నడుస్తున్న ఇంజిన్‌ జీరో అయిపోయింది.

అది జరిగిన నిమిషంలోనే ఎదురుగా మెయిన్‌ లైన్‌లో వస్తున్న హౌరా-బెంగళూరు రైలు కూడా జీరో కి.మీ స్పీడ్‌కి చేరుకుంది. అంటే దానర్థం కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎప్పుడైతే లూప్‌లైన్‌లోకి వచ్చి గూడ్స్‌ రైలును ఢీకొందో.. తర్వాతి నిమిషంలోనే మరో ట్రైన్‌ పక్కలైన్‌లోకి రావటం వల్ల బోగీలు దానికి తగిలి హౌరా-బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ చివరి బోగీలు కూడా పట్టాలు తప్పాయి. ఉదయం నుంచి సామాజిక మాధ్యమాలు, వివిధ వర్గాల నుంచి వస్తున్న ప్రశ్నల్లో ప్రధానమైన ప్రశ్న ఏంటంటే? ఒక రైలు పట్టాలు తప్పినప్పుడు రెండో రైలుకు సిగ్నల్‌ ఇవ్వకూడదు. మరి రెండో రైలు ఎందుకొచ్చిందని ప్రశ్నిస్తున్నారు. కానీ, ఇక్కడ రెండు ట్రైన్ల మధ్య గ్యాప్‌ నిమిషం కూడా లేదు. మెయిన్‌లైన్‌పై వెళ్లాల్సిన రైలు లూప్‌లైన్‌లోకి వచ్చి గూడ్స్‌రైలును ఢీకొట్టిన నిమిషంలోపే పక్క లైన్‌పై వెళ్తున్న హౌరా ఎక్స్‌ప్రైస్‌పై పట్టాలు తప్పిన రైలు బోగీలు పడటం వల్ల ఆ రైలు బోగీలు కూడా పట్టాలు తప్పాయి.

రైల్వేశాఖ ప్రాథమిక నివేదిక బట్టి చూస్తే కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌కు మెయిన్‌ లైన్‌లో సిగ్నల్‌ ఇచ్చి క్యాన్సిల్‌ చేయలేదు. డేటా లాకర్స్‌కు సంబంధించిన రిపోర్ట్స్‌ కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఆ రిపోర్ట్స్‌ ప్రకారం చూసినా.. స్టేషన్‌ మాస్టర్‌ ఇండికేటర్‌ ఏం చూపిస్తుందనేది తెలుస్తుంది. ఆ ఇండికేటర్‌లో మెయిన్‌ లైన్‌ నుంచి వెళ్లమని సూచించారు. కానీ, మెయిన్‌ లైన్‌లో వెళ్లాల్సిన రైలు లూప్‌లైన్‌లోకి ఎందుకు వెళ్లిందనేదానిపై అధికారులు లోతుగా విచారణ జరపాల్సిన అవసరముంది. సాంకేతిక సమస్య వచ్చినప్పుడు మాత్రమే ఇలా జరుగుతుంది. ఇందులో సిగ్నల్‌ ఫెయిల్యూర్‌ అయినా జరిగి ఉండొచ్చు లేదా ఇంజినీరింగ్‌ విభాగం వైఫల్యమైనా కావొచ్చు. క్షేత్రస్థాయిలో పరిశీలించిన అధికారులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. 

కోరమాండల్‌ కంటే ముందే గూడ్స్‌ రైలు వచ్చింది. కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌కు ఓవర్‌ టేక్‌ ఇవ్వడం కోసమే గూడ్స్‌ రైలును లూప్‌లైన్‌ నిలిపి ఉంచారు. ఆ స్టేషన్‌ లేఅవుట్‌లో రెండు మెయిన్‌ లైన్స్‌, రెండు లూప్‌ లైన్స్‌ ఉన్నాయి. రెండు మెయిన్‌లైన్ల మీదుగా రెండింటికీ ఒకేసారి సిగ్నల్‌ ఇచ్చారు. ఎడమవైపు, కుడివైపు దేని దారిలో ఆ ట్రైన్‌ వెళ్లిపోయేది. సాధారణంగా బోగీలు పట్టాలు తప్పితే పక్కన ఆగిపోతాయి. కానీ, ఇక్కడ 130 కిలోమీటర్ల వేగంతో కోరమాండల్‌, గూడ్స్‌ రైలును ఢీకొట్టడంతో బోగీలు పట్టాలు తప్పి రెండో మెయిన్‌ లైన్‌పై పడ్డాయి. హౌరా ఎక్స్‌ప్రెస్‌ ముందు క్రాస్‌ చేయడంతో చివరి బోగీలు తగిలాయి. అందుకే ఆ రైలుకు ప్రమాద తీవ్రత తక్కువ ఉంది. కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ కొద్ది నిమిషాల ముందు వచ్చి ఉంటే ప్రమాద తీవ్రత మరింత ఎక్కువగా ఉండేది. హౌరా ఎక్స్‌ప్రెస్‌ రైలు మరిన్ని బోగీలు పట్టాలు తప్పేవి’’ అని ఉప్పులూరి శశిధర్ వివరించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని