blood pressure: హైబీపీతో జాగ్రత్త.. ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి!

అధిక రక్తపోటు ఎన్నో అనర్థాలకు మూల కారణం.. దాదాపుగా ప్రతీ ఇంట్లో ఎవరికో ఒకరికి బీపీ ఉంటుంది.

Published : 06 Mar 2022 01:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అధిక రక్తపోటు ఎన్నో అనర్థాలకు మూల కారణం.. దాదాపుగా ప్రతీ ఇంట్లో ఎవరికో ఒకరికి బీపీ ఉంటుంది. ఇలాంటి అధిక రక్తపోటును నియంత్రించుకోకపోతే అది ప్రాణాంతకం కూడా మారుతుంది. ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలు వస్తాయి. దీన్ని అదుపులో ఉంచడానికి వాడే మందులపై అవగాహన చాలా అవసరం. ఈ విషయంపై డాక్టరు కె హరీష్‌, జనరల్‌ ఫిజిషియన్‌ను అడిగి తెలుసుకుందాం.

బీపీ అదుపు చేయడానికి మందులు వాడాల్సి ఉంటుందా..?

బీపీకి వైద్యం మొదలు పెట్టేముందు ఫార్మలాజికల్‌ థెరపీ, నాన్‌ ఫార్మలాజికల్‌ థెరపీని పరిశీలించాలి. నాన్‌ ఫార్మలాజికల్‌ థెరపీలో వ్యాయామం, ఆహారంలో మార్పులు చేసి బీపీని అదుపులోకి తీసుకొని రావొచ్చు. స్టేజీ-1 హైపర్‌టెన్షన్‌ ఉన్న వారికి నేరుగా మందులను ఇవ్వకుండా జీవనశైలిలో మార్పులు చేయడంతో ఫలితం ఉంటుంది.  1995లో అమెరికాలో డాష్‌డైట్‌ తీసుకొచ్చారు. ఈ డైట్‌లో 20 సిస్టాలిక్‌ పాయింట్లు తగ్గినట్టు గుర్తించారు.  ఫార్మలాజికల్‌ థెరపీలొ మందులను పేర్కొంటాం.

హైబీపీ అదుపు చేయడానికి ఏఏ మందులు వాడాలి..?

హైబీపీ ఉన్న వాళ్లలో మందులు పని చేసే విధానాన్ని ఆధారంగా చేసుకొని ఐదారు రకాల వాటిని సూచిస్తాం. డయురిటిక్స్‌, ఏసీఈఐ, బీటాబ్లాకర్‌, కాల్షియం ఛానల్‌ బ్లాకర్‌, అల్ఫాబ్లాకర్‌గా విభజించాం. ఇవి కూడా రోగి వయస్సు, ఇతర సమస్యలను పరిశీలించి ఇవ్వనున్నాం. 50 ఏళ్లలోపున్న వారికి ఏసీఈఐ, బీటా బ్లాకర్‌ మందులను వాడుతాం.  కిడ్నీల ద్వారా ప్రోటీన్లు పోకుండా కాపాడుతుంది. 50 ఏళ్లకు పైగా ఉన్న వారికి కాల్షియం ఛానల్‌ బ్లాకర్‌ను సూచిస్తాం. గుండె సంబంధిత సమస్యలను కూడా నివారిస్తుంది. బీపీతో పాటు కిడ్నీ సమస్య ఉన్నవారికి డయురిటిక్స్‌ మందులు బాగా ఉపయోగపడుతాయి. బీపీతో పాటు షుగర్‌ ఉంటే బీటాబ్లాకర్‌ రకాలను వినియోగిస్తాం.

బీపీ మందులను ఎవరెవరికి వాడుతారు..?

ముందుగా ఒక మందుతో ప్రారంభిస్తాం. రెండు, మూడు వారాలకోసారి బీపీ పరీక్ష చేసిన తర్వాత బీపీ తగ్గక పోతే ఇంకో మందును కలిపి ఉండే మందులను ఇస్తాం. ఇలాయినా తగ్గకపోతే మూడు డ్రగ్స్‌ను పేర్కొంటాం.  ఆహారంలో మార్పులు  చేసినా బీపీ తగ్గకపోతే రిసిస్టెంట్‌ హైపర్‌టెన్షన్‌ అంటాం.

ఒకే ఇంట్లో ఇద్దరు బీపీ రోగులుంటే ఒకరి మందులను మరొకరు వేసుకోవచ్చా..?

రోగులు సాధారణంగా చేసే తప్పులు కొన్ని ఉంటాయి. నాకు బీపీ ఎప్పుడూ 140కి పైగా ఉంటుంది. నా శరీరతత్త్వమే అంతా అంటారు. కొందరికి 5 మి.గ్రా ఉండొచ్చు. మరికొందరికి 40మి.గ్రా ఇవ్వొచ్చు. ఇతరులతో పోల్చుకోవద్దు.  మందులు మార్చుకోవద్దు కూడా..

ఉపవాసాలు, జబ్బు పడినపుడు మందులు ఆపొచ్చా..?

మలేరియా లాగా కోర్సు వాడి ఆపేయవద్దు. క్రమం తప్పకుండా మందులను వాడాల్సిందే. డాక్టరును సంప్రదిస్తే మందుల మోతాదు అవసరమైతే తగ్గిస్తారు. ఉపవాసాలు, జబ్బు పడినపుడు కూడా సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. వైద్యుల సలహా తీసుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని