Sleep Cycle: హాయిగా నిద్రించాలంటే.. ఈ చిట్కాలు పాటించండి!

నిద్ర సరిగా ఉంటేనే శరీరం విశ్రాంతి పొంది.. తిరిగి శక్తిని పుంజుకుంటుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మీరు నిద్రించే విధానం.. సమయాన్ని బట్టే మీ శరీరంలో అవయవాల పనితీరు ఆధారపడి ఉంటుంది. అందుకే ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు కనీసం 6 నుంచి 8 గంటలు నిద్రపోవాలని వైద్య నిపుణులు

Published : 20 Oct 2021 15:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నిద్ర సరిగా ఉంటేనే శరీరం విశ్రాంతి పొంది.. తిరిగి శక్తిని పుంజుకుంటుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మీరు నిద్రించే విధానం.. సమయాన్ని బట్టే మీ శరీరంలో అవయవాల పనితీరు ఆధారపడి ఉంటుంది. అందుకే ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు కనీసం 6 నుంచి 8 గంటలు నిద్రపోవాలని వైద్య నిపుణులు సూచిస్తుంటారు. కానీ, ఈ ఉరుకులు పరుగుల జీవితం, వివిధ సమయాల్లో ఉద్యోగులకు షిఫ్టులు, లేట్‌నైట్‌ పార్టీలు, వినోదాలు అంటూ నిద్రను నిర్లక్ష్యం చేస్తున్నారు. దీని వల్ల శారీరక అనారోగ్యంతోపాటు, మానసిక సమస్యలు తలెత్తుతాయి. అలా కాకూడదంటే.. మీరు నిద్రించే విధానంలో ఈ చిట్కాలు పాటించండి.

షెడ్యూల్‌ ఫిక్స్‌ చేసుకోండి

ఒక రోజు నిద్ర ముంచుకొస్తుందని తొందరగా పడుకోవడం.. మరో రోజు నిద్ర రావట్లేదని జాగారం చేయడం మంచిది కాదు. కనీసం 8 గంటలు పడుకునేలా సమయాన్ని షెడ్యూల్‌ చేసుకోండి. ప్రతి రోజు పడుకునే సమయం.. లేచే సమయం ఒకేలా ఉండాలి. అలా చేయడం కొన్ని రోజులు ఇబ్బందిగా అనిపించినా.. ఆ తర్వాత శరీరం, మెదడు ఆ సమయాలకు అలవాటు పడిపోతాయి.

మొబైల్‌కు దూరం

పడుకునే సమయంలో మొబైల్‌ను వీలైనంత వరకు దూరం పెట్టండి. సోషల్‌మీడియా, స్నేహితులతో చాటింగ్‌, సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చూస్తూ ఉంటే శరీరం యాక్టివ్‌గా ఉంటుంది. దీంతో నిద్ర అస్సలు పట్టదు. కాబట్టి నిద్రకు ఉపక్రమించే ముందే మొబైల్‌ను పక్కన పెట్టేయండి. దీంతో పడుకోగానే నిద్ర వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

వ్యాయామం చేస్తే సరి

వ్యాయామం చేయడం వల్ల శరీరం కాస్త అలసటకు గురై.. విశ్రాంతిని కోరుకుంటుంది. అందుకే రాత్రుళ్లు తిన్న తర్వాత వ్యాయామం కాకపోయినా కాసేపు వాకింగ్‌ చేసినట్లయితే తిన్న ఆహారం జీర్ణమై శరీరం తేలికగా అనిపిస్తుంది. హాయిగా నిద్ర పడుతుంది.

కునుకు తీస్తున్నారా?

చాలా మందికి మధ్యాహ్నం తినగానే కాసేపు కునుకు తీసే అలవాటు ఉంటుంది. ఆ కునుకు మంచిదే కానీ.. ఎక్కువ సేపు నిద్రించడం వల్ల రాత్రుళ్లు నిద్ర కరవవుతుంది. అందుకే, రాత్రి నిద్రకు భంగం కలగకుండా ఉదయంపూట కునుకుపాటు సమయాన్ని తగ్గించుకోవడం మంచిది.

తక్కువగా తినండి

రాత్రుళ్లు ఆహారం ఎంత తక్కువ తింటే అంత మంచిది. ఎక్కువ ఆహారం తింటే ఉబ్బసంతో కడుపు ఇబ్బంది పెడుతుంది. దీంతో నిద్ర సరిగా పట్టదు. అందుకే, పడుకునే సమయానికి కనీసం రెండు గంటల ముందు ఆహారం తీసుకోవాలి.

సాయంకాలంలో కాఫీకి నో

తరచూ కాఫీ తాగడం కొంత మందికి ఒక అలవాటు. కానీ, కాఫీలో ఉండే కెఫిన్‌ నిద్ర రాకుండా అడ్డుకుంటుంది. కాబట్టి రాత్రుళ్లు నిద్రకు భంగం కలకగకుండా ఉండాలంటే ప్రతి రోజు సాయంత్రం నుంచే కాఫీ తాగడం మానేయాలి. 

పడకగదిలో మార్పులు

ఎన్ని చేసినా నిద్ర రావట్లేదంటే.. పడక గదిలో వాతావరణాన్ని మార్చాల్సిందే. బయటి శబ్దాలు వినపడకుండా గదిలోని కిటికీ తలుపులు మూసివేయండి. మీకు సౌకర్యవంతంగా ఉండేలా పడకగదిని మార్చుకోండి. లైటింగ్‌, పరుపు, దిండుతో ఇబ్బందిగా ఉందేమో గమనించండి. అవి ఇబ్బందిగా అనిపిస్తే మీకు తగినట్టుగా మార్చండి.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని