
TS news : సీఎం సారూ.. సమయమివ్వండి : యూఎస్పీసీ
హైదరాబాద్ : ఉద్యోగ నియామకాల్లో స్థానికతను కాపాడాలని, జీవో నెంబర్ 317లోని లోపాలను సవరించాలని కోరుతూ ఉపాధ్యాయ సంఘాల పోరాట సమితి (యూఎస్పీసీ) ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాసింది. అభ్యంతరాలు పట్టించుకోకుండా కేటాయింపులు జరిగాయని సమితి సభ్యులు లేఖలో పేర్కొన్నారు. ‘‘ సీనియారిటీ జాబితాలు సమగ్రంగా తయారు చేయలేదని, స్పెషల్ క్యాటగిరీ అభ్యర్థనలను సక్రమంగా పరిశీలించలేదని వివరించారు. వితంతువులు, ఒంటరి మహిళలకు ప్రాధాన్యత ఇవ్వలేదని లేఖలో తెలిపారు. జిల్లాల కేటాయింపులో కొన్ని చోట్ల అక్రమాలు జరిగాయని, భార్యా భర్తలను ఒకే లోకల్ క్యాడర్‌కు బదిలీ చేయాల్సి ఉండగా కొందరికి మాత్రమే అవకాశ ఇచ్చారని రాసుకొచ్చారు. ఈ కారణంగా నష్టపోయిన అభ్యర్థులు న్యాయం కోసం అప్పీల్ చేసుకున్నారని, నెలరోజులు గడుస్తున్నా సదరు వినతులు పరిష్కారానికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో తీవ్రమైన ఆవేదన, అసంతృప్తి నెలకొందని, సమస్యలను నేరుగా తమ దృష్టికి తీసుకొచ్చేందుకు అనుమతి ఇవ్వాలని సీఎంను లేఖలో కోరారు.