Vande Bharat: తెలుగు రాష్ట్రాలకు సంక్రాంతి కానుక.. 15న వందే భారత్‌ రైలు ప్రారంభం

ఈనెల 15న ఉదయం 10 గంటలకు దిల్లీ నుంచి ప్రధాని మోదీ వర్చువల్‌గా వందే భారత్‌ రైలును ప్రారంభించనున్నారు. 

Published : 12 Jan 2023 01:32 IST

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్రం సంక్రాంతి కానుక అందజేయనుంది. సికింద్రాబాద్‌- విశాఖపట్నం మద్య నడవనున్న ‘వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌’ (Vande Bharat express) రైలు  ప్రారంభోత్సవం షెడ్యూల్‌ మారింది. ఈనెల 19న సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి వందే భారత్‌ రైలును మోదీ ప్రారంభిస్తారని తొలుత ప్రకటించారు. కానీ,  ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటన వాయిదా పడింది. దీనికితోడు పండుగ సమయంలో తెలుగు ప్రజలకు కానుక ఇచ్చేందుకు నాలుగు రోజుల ముందే ఈరైలును ప్రారంభించనున్నారు. ఈనెల 15న ఉదయం 10 గంటలకు దిల్లీ నుంచి ప్రధాని మోదీ వర్చువల్‌గా వందే భారత్‌ రైలును ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో జరిగే కార్యక్రమంలో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌, కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి పాల్గొంటారని రైల్వేశాఖ అధికారులు తెలిపారు. దేశంలోని 8వ వందే భారత్‌ రైలు సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరి వరంగల్‌, ఖమ్మం, విజయవాడ, రాజమహేంద్రవరం మీదుగా దాదాపు 8.40గంటల్లో విశాఖపట్నం చేరుకోనుంది. 

ముగిసిన ట్రయల్‌ రన్‌ 

తెలుగు రాష్ట్రాలు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ‘వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌’ నిర్వహణ పర్యవేక్షణలో భాగంగా బుధవారం విశాఖ రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. పూర్తిగా చైర్‌ కార్‌ బోగీలున్న ఈ రైలు అత్యంత వేగంగా గమ్యస్థానాలకు చేర్చుతుందని, అందువల్లే వందే భారత్‌ రైలుకు ప్రయాణికుల తాకిడి అధికంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ రైలు ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుందని, 8.40గంటల్లోనే విశాఖ నుంచి సికింద్రాబాద్‌ చేరుకుంటుందని విశాఖ రైల్వే స్టేషన్‌ సూపరింటెండెంట్‌ సురేష్‌ తెలిపారు. రైల్వే స్టేషన్‌లో అధికారులు పరిశీలించిన తర్వాత రైలును న్యూ కోచ్‌ కాంప్లెక్స్‌కు పంపించారు. లోకో పైలెట్‌ క్యాబిన్‌కు అనుసంధానంగా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఈ రైలు మొత్తం ఉంది. లోకో పైలెట్‌ ఆధీనంలో కోచ్‌ల ద్వారాలు తెరుచుకునే, మూసివేసే విధంగా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రయాణికుల అత్యవసర సహాయం కోసం ద్వారం వద్ద టాక్‌ బ్యాక్‌ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. విశాలమైన టాయిలెట్‌ ఈ కోచ్‌ ప్రత్యేకత. 

ఛార్జీలు ఎంతంటే?

వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణ వేళలు, ఛార్జీల వివరాల్ని రైల్వేశాఖ ప్రకటించాల్సి ఉంది. సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నానికి 699 కి.మీ దూరం. దిల్లీ.. జమ్మూలోని కట్రా మధ్య వందేభారత్‌ నడుస్తోంది. ఈ రెండింటి మధ్య దూరం 655 కి.మీ దూరం.ఛార్జీల్ని పరిశీలిస్తే- ఛైర్‌కార్‌ టికెట్‌ ధర రూ.1,665. ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌ కార్‌ ధర రూ.3,055. సికింద్రాబాద్‌- విశాఖపట్నం మధ్య దూరం ఇంకాస్త ఎక్కువే కావడంతో దిల్లీ-కాట్రా వందేభారత్‌ ఛార్జీల కంటే కొంచెం ఎక్కువే ఉండే అవకాశం ఉంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని