AP news: కూరగాయలు కొనలేం బాబోయ్‌..!

ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలకు కూరగాయల ధరలు కొండెక్కాయి. వర్షాల వల్ల పంటలు దెబ్బతినడంతో కూరగాయల ధరలు విపరీతంగా పెరిగాయి. ఇప్పటికే నిత్యావసర ధరలు పెరిగి అల్లాడుతున్న సామాన్యుడు..

Updated : 03 Dec 2021 22:16 IST

అమరావతి: ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలకు కూరగాయల ధరలు కొండెక్కాయి. వర్షాల వల్ల పంటలు దెబ్బతినడంతో కూరగాయల ధరలు విపరీతంగా పెరిగాయి. ఇప్పటికే నిత్యావసర ధరలు పెరిగి అల్లాడుతున్న సామాన్యుడు.. కూరగాయల ధరలు సైతం ఆకాశాన్నంటడంతో బిక్కమొహం వేస్తున్నాడు.

పడిపోయిన దిగుమతి

రాష్ట్రంలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. పొలాల్లో నీరు నిలిచిపోయి కూరగాయలు ఎర్రబారిపోయి దిగుమతులు పడిపోతున్నాయి. సాధారణంగా ఒక్కో మార్కెట్‌కు 40 నుంచి 50 క్వింటాళ్ల కూరగాయలు రావాల్సి ఉంటే.. ఏడు నుంచి 8 క్వింటాళ్లే అందుబాటులో ఉంటున్నాయి. మరోవైపు ఇంధన ధరల పెరుగుదలతో రవాణా వ్యయం కూడా పెరిగింది. నెల క్రితంతో పోలిస్తే..  కూరగాయల ధరలు 100 నుంచి 200శాతం వరకు పెరిగినట్లు అంచనా.

టమాటా రూ.72

రాయలసీమ, నెల్లూరు జిల్లాలను వర్షాలు ముంచెత్తడంతో అక్కడ రేట్లు మరింత భారమయ్యాయి. మొన్నటి వరకు కిలోల లెక్కన కూరగాయలు కొనుగోలు చేసిన వినియోగదారులు ఇప్పుడు పావు కిలో, అరకిలోతో సరిపెట్టుకుంటున్నారు. రైతు బజార్లలోనే కిలో టమాటా ధర రూ.72 వరకు పలుకుతోంది. బహిరంగ మార్కెట్లో అయితే కిలో రూ.100 వరకు ఉంది. ఆన్‌లైన్‌ స్టోర్లలోనూ కిలో రూ.99 వరకు విక్రయిస్తున్నారు. రూ.కిలో 10 నుంచి రూ.20లోపు ఉండే దోస.. ఏకంగా రూ.40 వరకు చేరడమే.. ధరల తీరును తెలియజేస్తోంది.

బయట మరీ బాదుడు

బయట మార్కెట్లలో ధరలు రైతు బజార్లలో కంటే 30శాతం నుంచి 60 శాతం వరకు అధికంగా ఉంటున్నాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వానలతో పూతలు నిలవడం లేదని రైతులు అంటున్నారు. పొలాల్లో తేమ ఎక్కువై తోటలు ఎర్రగా మారుతున్నాయి. వానలు తగ్గాక అక్కడక్కడా పూత వచ్చినా.. మళ్లీ జల్లులు కురవడంతో అది కూడా రాలిపోతోంది. పంట పూర్తిగా దెబ్బతింటుందని, రైతుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. తీగజాతి కూరగాయ తోటలైతే మరింత దెబ్బతిన్నాయని, మరికొన్ని రోజులు ఇలాంటి పరిస్థితులే కొనసాగే అవకాశముందని రైతులు చెబుతున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని