AP High Court: ఆర్‌-5 జోన్ వ్యవహారం.. తీర్పు రిజర్వ్‌

ఆర్‌-5 జోన్ వ్యవహారంపై ఏపీ హైకోర్టులో వాదనలను ముగిశాయి. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం దీనిపై తీర్పును రిజర్వ్‌ చేసింది.

Published : 21 Apr 2023 16:21 IST

అమరావతి: రాష్ట్రంలో ఏ ప్రాంతానికి చెందిన పేదలకైనా రాజధాని అమరావతి(Amravati)లోని 900 ఎకరాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు వీలుగా బృహత్‌ ప్రణాళికలో మార్పులు చేసి ఆర్‌-5 జోన్‌ (R-5 Zone) ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గెజిట్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనిపై దాఖలైన పిటిషన్లపై తాజాగా హైకోర్టులో (AP High Court) విచారణ ముగిసింది. పిటిషనర్లతోపాటు, ప్రభుత్వం తరఫు వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా (Justice Prashant Kumar Mishra) నేతృత్వంలోని ధర్మాసనం.. తీర్పును రిజర్వ్‌ చేసింది. రైతుల అభిప్రాయాన్ని పట్టించుకోకుండా రాజధానిలో ఆర్‌-5 జోన్‌ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గెజిట్‌ జారీ చేసింది. మంగళగిరి మండలం కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు, తుళ్లూరు మండలంలోని మందడం, ఐనవోలు గ్రామాల పరిధిలో దాదాపు 900 ఎకరాలను ఆర్‌-5 జోన్‌ పరిధిలోకి ప్రభుత్వం తీసుకొచ్చింది.

ఆర్‌-5 జోన్‌ ఏర్పాటుపై 2022 అక్టోబరులోనే ప్రభుత్వం జీవో విడుదల చేసింది. అయితే, ప్రభుత్వ నిర్ణయం సరికాదని, జీవోను వ్యతిరేకిస్తూ అప్పట్లో రాజధాని రైతులు కోర్టుకు వెళ్లారు. కనీసం రైతుల అభిప్రాయాలు తీసుకోలేదని న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. కోర్టు ఆదేశాలతో అధికారులు రాజధాని గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని మూకుమ్మడిగా రాజధాని రైతులు వ్యతిరేకించారు. అయినా, రైతుల అభిప్రాయాన్ని పట్టించుకోకుండా ప్రభుత్వం ఆర్‌-5 జోన్‌ ఏర్పాటుపై గెజిట్‌ విడుదల చేసింది. పేద వర్గాల ఇళ్ల కోసం భూములు కేటాయిస్తున్నట్టు గెజిట్‌లో పేర్కొంది. దీంతో ప్రభుత్వ నిర్ణయాన్ని మరోసారి రాజధాని రైతులు న్యాయస్థానంలో సవాల్‌ చేశారు.

ఏమిటీ ఆర్‌5 జోన్‌?

రాజధాని బృహత్‌ ప్రణాళిక ప్రకారం ఇప్పటి వరకు 4 నివాస జోన్లు ఉండేవి. మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం రాజధానిలో ఇంతవరకు ఆర్‌-1 (ప్రస్తుత గ్రామాలు), ఆర్‌-2 (తక్కువ సాంద్రత గృహాలు), ఆర్‌-3 (తక్కువ నుంచి మధ్యస్థాయి సాంద్రత కలిగిన గృహాలు), ఆర్‌-4 (హైడెన్సిటీ జోన్‌) పేర్లతో 4 రకాల నివాస జోన్లు ఉండేవి. అయితే, రాజధానిలోని కృష్ణాయపాలెం, వెంకటపాలెం, నిడమర్రు, కురగల్లు, మందడం, ఐనవోలు గ్రామాల పరిధిలోని 967.25 ఎకరాలను నివాస ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించింది. అందులోని 900.97 ఎకరాలను ఆర్‌-5 జోన్‌గా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గెజిట్‌ జారీ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని