Andhra News: వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దని విద్య నిరుపయోగం: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

పాటిబండ్ల సీతారామయ్య పాఠశాల ఎంతోమంది సమర్థులను దేశానికి అందించిందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. 

Published : 01 Mar 2022 19:32 IST

గుంటూరు: పాటిబండ్ల సీతారామయ్య పాఠశాల ఎంతోమంది సమర్థులను దేశానికి అందించిందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఎంతో ముందుచూపుతో ఆయన ఈ పాఠశాలను ఏర్పాటు చేశారన్నారు. గుంటూరు జిల్లా లక్ష్మీపురంలో పాటిబండ్ల సీతారామయ్య ఉన్నత పాఠశాల వజ్రోత్సవ వేడుకలకు ఉపరాష్ట్రపతి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పైలాన్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో వెంకయ్య మాట్లాడారు. 

సమాజంలో రోజురోజుకూ విలువలు తగ్గుతున్నాయని.. వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దని విద్య నిరుపయోగమని వెంకయ్యనాయుడు అన్నారు. ప్రజల మధ్య విభేదాలు సృష్టించి విడగొడుతున్నారని.. నాయకులే ప్రజల మధ్య చీలికలు తీసుకురావడం బాధాకరమన్నారు. చట్టసభల్లోనే బూతులు, అసభ్య పదజాలం వాడటం దారుణమని చెప్పారు. ఇతరుల కోసం బతికితే చాలా కాలం జీవిస్తామని మన భారతీయ ధర్మం చెబుతోందన్నారు. అలా సమాజం కోసం పాటుపడిన వారిని ప్రజలు చిరకాలం గుర్తుంచుకుంటారని చెప్పారు. 

ఉపరాష్ట్రపతి అయ్యాకా నా వేషధారణ మార్చలేదు

ఉపరాష్ట్రపతి అయ్యాక కూడా తన వేషధారణ మార్చలేదని వెంకయ్యనాయుడు అన్నారు. మన సంప్రదాయ వస్త్రధారణతో ఏ దేశానికి వెళ్లినా అందరూ గౌరవిస్తున్నారని చెప్పారు. మన సంప్రదాయాలను మనం పాటిస్తే ప్రపంచం మనల్ని గౌరవిస్తుందన్నారు. ప్రజలకు దగ్గరగా ఉండటమే తనకు ఇష్టమని.. ఉపరాష్ట్రపతి అయ్యాక గతంలో మాదిరిగా తరచూ వచ్చే అవకాశం లేకుండా పోయిందని చెప్పారు. 

తెలుగుదనానికి యడ్లపాటి నిదర్శనం

అంతకుముందు రాజకీయ కురువృద్ధుడు, మాజీమంత్రి యడ్లపాటి వెంకట్రావు మృతికి వెంకయ్యనాయుడు సంతాపం తెలిపారు. తెలుగుదనానికి ఆయన నిదర్శనంగా కనిపించేవారని.. ఎన్నో పదవులు చేపట్టారన్నారు. క్రమశిక్షణతో యడ్లపాటి ఆ స్థాయికి చేరుకున్నారని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని