Andhra News: అల్లూరి ఏ ఒక్క ప్రాంతానికో చెందిన వ్యక్తి కాదు: ఉపరాష్ట్రపతి వెంకయ్య

మహనీయుల జీవితాలను పాఠ్యాంశాల్లో చేర్చడం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావితరాలకు సమాజహిత సందేశాన్ని అందించవచ్చని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు.

Published : 19 Apr 2022 16:30 IST

పద్మనాభం: మహనీయుల జీవితాలను పాఠ్యాంశాల్లో చేర్చడం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావితరాలకు సమాజహిత సందేశాన్ని అందించవచ్చని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ‘ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌’లో కార్యక్రమంలో భాగంగా ‘సమరయోధులను స్మరించుకుందాం’ పేరిట విశాఖ జిల్లా పద్మనాభం మండలంలోని అల్లూరి సీతారామరాజు స్వగ్రామం పాండ్రంకిని మిజోరం గవర్నర్‌ కంభంపాటి హరిబాబుతో కలిసి ఆయన సందర్శించారు. 

ఈ సందర్భంగా అల్లూరి నివసించిన ఇంటిని సందర్శించడంతో పాటు గ్రామంలో ఆయన విగ్రహానికి వెంకయ్యనాయుడు, హరిబాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానికులతో ఉపరాష్ట్రపతి ముచ్చటించారు. రవి అస్తమించని బ్రిటీష్‌ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు ఏ ఒక్క ప్రాంతానికో చెందిన వ్యక్తి కాదన్నారు. యువత ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని సమాజ శ్రేయస్సుకు తోడ్పడాలని సూచించారు. స్వాతంత్ర్య సమరయోధుల ఆశయ సాధనకు కృషి చేయాలని వెంకయ్య పిలుపునిచ్చారు. అనంతరం బర్లపేటలో స్వాతంత్ర సమరయోధులు రూపాకుల సుబ్రహ్మణ్యం, రూపాకుల విశాలాక్షి దంపతుల కాంస్య విగ్రహాలను ఆవిష్కరించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని