Published : 20 Feb 2021 17:38 IST

మనసుకో ‘ఆట’!

 

  • అదో చిక్కుదారి. దారి తప్పకుండా వెళ్లాలి. పోయిన వస్తువులను వెతికి పట్టుకోవాలి. గమ్యాన్ని చేరుకోవాలి.
  • రోడ్డు నిండా వాహనాలు. అన్నింటినీ తదేకంగా గమనిస్తూ.. దేనికీ ఢీకొట్టకుండా నడుపుతూ వెళ్లాలి. సురక్షితంగా ఇంటికి చేరుకుంటే మంచి బహుమతి లభిస్తుంది. 
  • పైకి ఎగబడుతున్న శత్రువులు. తనకు తోడుగా ఉన్నది ఓ కుక్క. దాని సాయంతోనే విజయం సాధించాలి.

- ఇవేం పనులని అనుకుంటున్నారా? పనుల కావు, ఆటలు. అదీ వీడియో ఆటలు. పిల్లల కోసం అనుకుంటున్నారేమో. కానే కాదు. మానసిక సమస్యలతో బాధపడేవారి కోసం. ఆటలాడుకున్నంత తేలికగా జబ్బుల నుంచి బయటపడేయాలన్నది వీటి ఉద్దేశం. 

ఒకవైపు మానసిక ఉల్లాసం, ఉత్సాహం. మరోవైపు పాయింట్లు గెలుచుకోవటం, అంచెలు అధిగమించటం, పొడుపుకథలు విప్పటం, కొత్త సాధనాలను తెరవటం వంటి పనులతో బహుమతులు దక్కించుకోవటం. మానసిక సమస్యలతో బాధపడేవారికి ఇంతకన్నా ఆటవిడుపు ఏం కావాలి? కాబట్టే వీడియో, మొబైల్, ఆన్‌లైన్‌ గేమ్స్‌ వంటివి మానసిక చికిత్సల్లో భాగమవుతున్నాయి. తమకు తెలియకుండానే ఆలోచనా ధోరణులు, భావోద్వేగాల నియంత్రణకు తోడ్పడే వీటిపై రోజురోజుకీ ఆసక్తి పెరుగుతోంది. కుంగుబాటు, ఆందోళన, మళ్లీ మళ్లీ అదే పని చేయటం, మతిమరుపు, భయాలు, దీర్ఘకాల నొప్పుల వంటి సమస్యల విషయంలో ఇవి బాగా ఉపయోగపడుతున్నట్టు నిపుణులు భావిస్తున్నారు. ఇవి ఆరోగ్యంగా ఉన్నవారికి సైతం జ్ఞాపకశక్తి, ఏకాగ్రత మెరుగుపడటానికి తోడ్పడుతుండటం గమనార్హం.

ఉదాహరణకు- ల్యూమో సిటీనే తీసుకోండి. యాప్‌ రూపంలో ఉండే ఇది రోజుకో కొత్త గేమ్‌తో మెదడుకు సవాళ్లు విసురుతుంది. ఆలోచనలకు పదును పెడుతుంది. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, సమయానుకూలంగా ఆలోచనలను మార్చుకోవటం వంటి నైపుణ్యాలు పెరగటానికి సాయం చేస్తుంది. అందుకే మెదడు దిబ్బతిన్నవారికి దీన్ని వినియోగిస్తున్నారు. రోజూ దీంతో ఆడుకోవటం ద్వారా జ్ఞాపకశక్తి సన్నగిల్లకుండా కాపాడుకోవచ్చని ఒక అధ్యయనం పేర్కొంటోంది. మానసిక సమస్యల్లో ఇలాంటి డిజిటల్‌ గేమ్స్‌ ఆధారిత చికిత్సల పట్ల ఆకర్షణ పెరుగుతుండటానికి మరో కారణం- అసలివి చికిత్సగానే అనిపించకపోవటం. మనకు తెలియకుండానే ఆటలో ఆటగా కలిసిపోతుంది. మందులు వేసుకోవటం కన్నా వీటిని అంగీకరించే అవకాశం ఎక్కువగా ఉండటం, మానసిక సమస్యల బాధితుల పట్ల చూపే వివక్ష వంటివేవీ లేకపోవటమూ కలిసి వస్తున్నాయి. పైగా డిజిటల్‌ గేమ్స్‌ను ఆయా వయసుల వారికి అనుగుణంగానూ మార్చుకోవచ్చు. అందరికీ అందుబాటులో ఉండేలా చూసుకోవచ్చు. ఖర్చూ తక్కువే. మందులతో తలెత్తే దుష్ప్రభావాల బెడదా ఉండదు.

ఎన్నెన్నో లాభాలు
వీడియే గేమ్స్‌ ఆడేవారు తక్షణం నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అతి వేగంగా స్పందించాల్సి ఉంటుంది. ఒకే సమయంలో రకరకాల పనులు చేయాల్సి ఉంటుంది. మెదడు నుంచి అందే సూచనలకు అనుగుణంగా కంట్రోలర్‌ లేదా మౌజ్‌ను కదిలించాల్సి ఉంటుంది. ఇందుకు ఏకాగ్రత చాలా అవసరం. ఈ క్రమంలో మానసికంగా ఎన్నో లాభాలు చేకూరతాయి. చికిత్సలకు వీటిని వినియోగించుకోవటానికివే పురికొలుపుతున్నాయి. 
జ్ఞాపకశక్తి మెరుగు: సమస్యలను ఛేదించే గేమ్స్‌ ఆడేటప్పుడు ఒకే సమయంలో రకరకాల సమాచారాన్ని విడమర్చి, అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటప్పుడు నుదుటి వద్ద మెదడు భాగం ఉత్తేజితమవుతుంది. జ్ఞాపకశక్తి, సమస్యల పరిష్కారంలో పాలు పంచుకునేది ఇదే. ఇలా జ్ఞాపకశక్తి పుంజుకోవటానికి వీలవుతుంది.

భావోద్వేగాల నియంత్రణ: ఆన్‌లైన్‌లో ఇతరులతో కలిసి ఆడేటప్పుడు అనుబంధాలూ బలోపేతమవుతాయి. అవతలివారితో చర్చలు జరపటం, సందేశాలు పంపుకోవటం భావోద్వేగాల నియంత్రణకూ తోడ్పడుతుంది. 
ఒత్తిడి నుంచి ఉపశమనం: బయటి ప్రపంచం నుంచి ధ్యాస మళ్లించటం ద్వారా ఒత్తిడి తగ్గుముఖం పట్టేలా చేస్తాయి. ఆటలో విజయం సాధించినప్పుడు, లక్ష్యాన్ని ఛేధించినప్పుడు మంచి ఉత్సాహం కలుగుతుంది. ఇది మానసిక సమస్యల నుంచి బయటపడటానికి తోడ్పడుతుంది. 
మానసిక దృఢత్వం: అతివేగంగా నిర్ణయాలు మార్చుకోవటం, సరైన నిర్ణయాలు తీసుకోవటం వంటి పనులతో మెదడు సామర్థ్యం ఇనుమడిస్తుంది. అంటే మేధోశక్తి పెంపొందుతున్నమాట.
కుదురైన ఏకాగ్రత: ఆడుతున్నప్పుడు ఏమాత్రం దృష్టి చెదిరినా మొదటికే మోసం వస్తుంది. అందుకే ఏకాగ్రతతో దృష్టి సారించాల్సి వస్తుంది. ఇది మెదడుకు ఒక శిక్షణగా ఉపయోగపడుతుంది. క్రమంగా అలవాటుగా మారుతుంది. ఇది జీవితంలో అన్ని సందర్భాల్లోనూ మేలు చేస్తుంది. 

పెరుగుతున్న ప్రాధాన్యం

మనదేశంలో శారీరక సమస్యల మీద శ్రద్ధ పెట్టటమే తక్కువ. అలాంటిది మానసిక జబ్బులను ఎవరు పట్టించుకుంటారు? జాతీయ మానసిక ఆరోగ్య సర్వే ఇదే చెబుతోంది. దీని ప్రకారం మనదేశంలో ప్రతి ఐదుగురిలో ఒకరు మానసిక జబ్బులతో బాధపడుతున్నారు. చికిత్సల మీదా పెద్దగా దృష్టి పెట్టటం లేదు. దాదాపు 86% మంది సరైన చికిత్సే తీసుకోవటం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మరోవైపు మానసిక నిపుణుల కొరతా ఎక్కువే. అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రతి 10 లక్షల మందికి 60 మంది మానసిక చికిత్స నిపుణులు ఉంటుండగా.. మన దగ్గర కేవలం ఏడుగురే ఉన్నారు. వీరిలో ఎక్కువమంది పట్టణాలకే పరిమితమవుతున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మానసిక నిపుణుల జాడే కనిపించదు. వనరుల పరంగా ఇలాంటి కొరత నెలకొన్న నేపథ్యంలో మానసిక చికిత్సలో వీడియోగేమ్స్‌ వాడకానికి రోజురోజుకీ ప్రాధాన్యం పెరుగుతోంది. 

సవాళ్లు లేకపోలేదు

స్మార్ట్‌ఫోన్ల వాడకం రోజురోజుకీ పెరిగిపోతున్న మనదేశంలో మానసిక చికిత్సల్లో వీడియో గేమ్స్‌ వాడకం గణనీయంగా పుంజుకుంటుందనటంలో ఎలాంటి సందేహం లేదు. కానీ దీన్ని అమలు చేయటంలోనే చాలా చిక్కులు ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. మానసిక చికిత్సలు, కౌన్సెలింగ్, ఉపశమన విధానాల్లో డిజిటల్‌ గేమ్స్‌ను వినియోగించుకోవటం ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. వీటి సామర్థ్యంపై ఇప్పటికీ అధ్యయనాలు సాగుతూనే ఉన్నాయి. వీటిని ఎంతవరకు, ఎంతసేపు చికిత్సగా వాడుకోవాలనే దానిపైనా కచ్చితమైన మార్గదర్శకాలు లేవు. పైగా డిజిటల్‌ పరికరాల వాడకం వ్యసనంగా మారే ప్రమాదమూ ఉంది. ముఖ్యంగా పిల్లలకు ఇలాంటి ముప్పు ఎక్కువ. అందువల్ల సంప్రదాయ చికిత్సలే ప్రధానంగా కొనసాగుతున్న నేటి వ్యవస్థలో ఇప్పటికైతే వీడియో గేమ్స్‌ను అనుబంధ పద్ధతిగానే వాడుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. పేదరికం, ఆత్మహత్యలు ఎక్కువగా ఉండే మనదేశంలో ఇలాంటి ‘అనూహ్య’ చికిత్సలను అనుమాన దృష్టితో చూసే అవకాశం లేకపోలేదు. వేటినైనా చికిత్సలుగా వాడుకోవాలంటే అమెరికా ఎఫ్‌డీఏ అనుమతి తప్పనిసరి. ప్రస్తుతానికి మానసిక జబ్బుల చికిత్సలో వాడుకోవటానికి ఎఫ్‌డీఏ ఆమోదం లభించిన ఆట ఒక్కటే. అది ఎండీవర్‌ఆర్‌ఎక్స్‌. ఏకాగ్రత లేని అతిచురకుదనం సమస్యతో (ఏడీహెచ్‌డీ) బాధపడేవారి కోసం దీన్ని రూపొందిచారు. మిగతావన్నీ ప్రయోగ పరీక్షల దశలోనే ఉన్నాయి. ఇలాంటి సమస్యలను అధిగమించగలిగితే తేలికైన మానసిక చికిత్సలు ఒక ఆటగానే సాగిపోవచ్చు.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని