
Video: పోలీసు హీరోయిజం.. ప్రయాణికుడికి తప్పిన ప్రమాదం
దిల్లీ: రైల్వే పోలీసు వేగంగా స్పందించడంతో ఓ ప్రయాణికుడికి ప్రాణాపాయం తప్పింది. రైలు ఎక్కబోతూ కిందపడిన ఆ వ్యక్తిని పోలీసు కానిస్టేబుల్ కాపాడుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. దిల్లీ కంటోన్మెంట్ రైల్వే స్టేషన్లో గుర్తు తెలియని వ్యక్తి తన రెండు చేతుల్లో సామానుతో కదులుతున్న రైల్లోకి ఎక్కేందుకు ప్రయత్నించాడు. ముందుగా తన చేతిలోని సంచులను ఆ రైల్లో పెట్టి అనంతరం తానూ ఎక్కబోయాడు. అయితే అతడి అడుగు తడబడటంతో కాలు జారి ప్లాట్‌ఫాం, రైలుకు మధ్య ఉన్న సందులోకి పడిపోయాడు. అదే సమయంలో అతడి వెనకే ఉన్న మరో ప్రయాణికుడు సహా సమీపంలోనే ఉన్న ఆర్పీఎఫ్ పోలీసు కానిస్టేబుల్ రాజ్వీర్ సింగ్ వేగంగా స్పందించారు. ఒక్క ఉదుటున పరిగెత్తి అతడిని పైకి లాగేందుకు ప్రయత్నించారు. అయితే వారికి పట్టు చిక్కకపోవడంతో అతడిని రైలు కొంత దూరం లాక్కెళ్లింది. రాజ్వీర్ సింగ్ మళ్లీ వేగంగా పరుగెత్తుకుంటూ వెళ్లి అతడిని ప్లాట్‌ఫాంపైకి లాగేశారు. తృటిలో ఆ ప్రయాణికుడికి ప్రాణాపాయం తప్పడంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. వేగంగా స్పందించి ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడిన రాజ్వీర్ సింగ్‌ను ప్రశంసిస్తూ.. ఈ వీడియోను ఆర్పీఎఫ్ పోలీసులు ట్విటర్లో పోస్టు చేశారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. కానిస్టేబుల్‌ను రియల్ హీరోగా పేర్కొంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.