Andhra News: 50శాతం పన్ను మా వల్ల కాదు: విజయవాడ ఆటోనగర్ కార్మికులు

ఏపీ ప్రభుత్వం జారీ చేసిన 5, 6 నంబర్‌ జీవోలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ విజయవాడ ఆటోనగర్‌ వ్యాపారులు, కార్మికులు బంద్‌ చేపట్టారు.

Updated : 07 Apr 2022 13:22 IST

విజయవాడ: ఏపీ ప్రభుత్వం జారీ చేసిన 5, 6 నంబర్‌ జీవోలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ విజయవాడ ఆటోనగర్‌ వ్యాపారులు, కార్మికులు బంద్‌ చేపట్టారు. నగరాలకు దూరంగా పారిశ్రామిక ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ఇటీవల ఈ జీవోలు తెచ్చింది. ఒకప్పుడు నగర శివారు, ఇప్పుడు నగరం నడిబొడ్డున ఉన్న ఆటోనగర్‌కు తాజా జీవోల నుంచి వెసలుబాటు ఇవ్వాలని వ్యాపారులు డిమాండ్‌ చేశారు. ఆటోనగర్ పారిశ్రామికవాడను కమర్షియల్‌గా మారుస్తూ ఇచ్చిన జీవోలను ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ ప్రాంతాన్ని కమర్షియల్ చేస్తూ 50శాతం పన్ను చెల్లించాలన్న జీవోను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు.

తమకు స్థలాలు ఉచితంగా రాలేదని కార్మిక సంఘాలు, వ్యాపారులు తెలిపారు. ఆటోనగర్‌పై సుమారు లక్ష మంది ఆధారపడి ఉన్నారని.. రవాణా రంగం అభివృద్ధికి ఈ ప్రాంతం చాలా ఉపయోగపడిందన్నారు. ఆసియా ఖండంలోనే ఆటోనగర్‌ అతిపెద్దదని కార్మికులు చెప్పారు. ఈ ప్రాంతాన్ని కమర్షియల్‌ చేస్తామనడం సమంజసం కాదన్నారు. 50శాతం పన్ను చెల్లించడం తమ వల్ల కాదని స్పష్టం చేశారు. చిన్న పరిశ్రమలు నడుపుకొనే వారు ఇంత పన్ను కట్టగలరా అని ప్రశ్నించారు. పరిశ్రమలు తరలిపోతే మనుగడ కష్టమవుతుందని కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని