Andhra News: సీఎం అయినా జగన్‌ సంతోషంగా లేరు: మంత్రి పినిపే విశ్వరూప్‌

రాష్ట్రంలో లారీ యజమానులు తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నారని.. వారి సమస్యలు సత్వరమే పరిష్కరించాలని ఏపీ లారీ ఓనర్స్ అసోషియేషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇతర రాష్ట్రాల కంటే రాష్ట్రంలో డీజిల్ రేట్లు, జరిమానాలు ఎక్కువగా ఉండటం వల్ల తీవ్రంగా నష్టపోతున్నట్లు...

Published : 04 May 2022 02:27 IST

అమరావతి: రాష్ట్రంలో లారీ యజమానులు తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నారని.. వారి సమస్యలు సత్వరమే పరిష్కరించాలని ఏపీ లారీ ఓనర్స్ అసోషియేషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇతర రాష్ట్రాల కంటే రాష్ట్రంలో డీజిల్ రేట్లు, జరిమానాలు ఎక్కువగా ఉండటం వల్ల తీవ్రంగా నష్టపోతున్నట్లు అసోసియేషన్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. లారీలపై అధికారులు వేస్తోన్న జరిమానాలు తగ్గించాలని కోరారు. రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన  పినిపే విశ్వరూప్, రవాణా శాఖ మాజీ మంత్రి పేర్ని నానిని ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోషియేషన్ నేతృత్వంలో ఘనంగా సత్కరించారు. విజయవాడలోని లారీ ఓనర్స్ అసోషియేషన్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా లారీ యజమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లారీ యజమానులు పడుతోన్న కష్టాలను మంత్రి పినిపె విశ్వరూప్‌ దృష్టికి తీసుకెళ్లారు.

‘‘ఇతర రాష్ట్రాల కంటే ఏపీలో డీజిల్ రేట్లు ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువ రేటుకు డీజిల్ కొనుగోలు చేయడం ద్వారా లారీ యజమానులు తీవ్రంగా నష్టపోతున్నారు. డీజిల్‌పై విధిస్తున్న టాక్స్ లను తగ్గించాలి. కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్లు లేక లారీ యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ, ఏపీ మధ్య కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్లు జారీ చేయాలి. ఆర్టీఏ అధికారులు ఇష్టమొచ్చినట్లు లారీలపై కేసులు నమోదు చేస్తూ ఇబ్బందులు పెడుతున్నారు. లారీలపై గ్రీన్ టాక్స్‌ను రూ.200 నుంచి రూ.20 వేలకు పెంచడంతోపాటు భారీ మొత్తంలో జరిమానాలు విధించడంతో నానా కష్టాలు పడుతున్నాం. ఆర్థిక సంక్షోభం దృష్ట్యా జరిమానాలు తగ్గించాలి. సమస్యల పరిష్కారం కోసం వినతిపత్రం ఇచ్చేందుకు సీఎం జగన్‌ అపాయింట్‌మెంట్‌ కోసం మూడేళ్లుగా ప్రయత్నిస్తున్నా ఇవ్వడం లేదు. సమస్యలు వివరిస్తాం.. సీఎం జగన్‌తో అపాయింట్‌మెంట్‌ ఇప్పించండి’’ అని లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు మంత్రిని కోరారు.

దీనిపై మంత్రి పినిపే విశ్వరూప్ స్పందిస్తూ.. ‘‘లారీ యజమానుల సమస్యల పరిష్కారానికి నావంతుగా చిత్తశుద్ధితో కృషి చేస్తాను. రాష్ట్ర విభజనతో తెలంగాణకు మిగులు బడ్జెట్ వెళ్తే, ఏపీకి లోటు బడ్జెట్ వచ్చింది. కొవిడ్‌తో వచ్చిన ఆర్థిక సంక్షోభంతో సీఎం జగన్ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. సీఎం అయినా జగన్‌ సంతోషంగా లేరు. ఏడాదిలో ఒకసారైనా సీఎం వద్ద లారీ యజమానుల సంఘం నేతలతో సమావేశం ఏర్పాటుకు ప్రయత్నిస్తాను. సీఎంతో చర్చించి లారీ యజమానుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటాను.  లారీలకు కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్ల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించేందుకు ప్రయత్నం చేస్తాను’’ అని మంత్రి విశ్వరూప్‌ హామీ ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని