Updated : 01 Jan 2021 05:36 IST

ఊపిరితిత్తుల్లో తీవ్ర ప్రభావం..కారణమేమంటే!

ఇంటర్నెట్‌ డెస్క్‌: వైరస్‌, బాక్టీరియాల ప్రభావం ఊపిరితిత్తులపైనే ఎక్కువగా ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇక కరోనా సోకిన కొన్నికేసుల్లో ఈ వైరస్‌ ఊపిరితిత్తుల్లో తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నట్లు శాస్త్రవేత్తలు ఇప్పటికే గుర్తించారు. ఇందుకు గల కారణాలను తెలుసుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా శ్వాసకోస నిపుణులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇందులో భాగంగా స్వీడన్‌కు చెందిన కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్తలు తీవ్ర ఊపిరితిత్తుల వ్యాధులకు గల కారణాలను విశ్లేషించారు. ముఖ్యంగా వైరస్‌ ప్రభావం పెరగడంలో  మాక్రోఫేజ్‌లుగా పిలిచే రోగనిరోధక కణాల పనితీరే కారణంగా గుర్తించారు. తాజాగా ఈ పరిశోధనా పత్రం ఇమ్యూనిటీ జర్నల్‌లో ప్రచురితమైంది.

గాలి, రక్తం ద్వారా వైరస్‌, బాక్టీరియాలు శరీరంలోకి ప్రవేశించి ఊపిరితిత్తులపై దాడిచేసినపుడు వాటినుంచి రక్షణ కల్పించేందుకు మాక్రోఫేజ్‌లుగా పిలిచే రోగనిరోధక కణాలు వీటిని అడ్డుకొని నాశనం చేస్తాయి. కానీ, కొన్ని సందర్భాల్లో ఇవే కణాలు సీఓపీడి(COPD) వంటి తీవ్ర ఊపిరితిత్తుల వ్యాధులకు కారణమవుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఊపిరితిత్తుల్లో ఈ మాక్రోఫేజ్‌ల వృద్ధిని తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు వైరస్‌ సోకిన వ్యక్తుల ఊపిరితిత్తులపై ప్రయోగాలు జరిపారు. వ్యక్తిగత కణాల జన్యు కార్యకలాపాలు, ఆర్‌ఎన్‌ఏ సరళి (సీక్వెన్సింగ్)‌ ద్వారా రక్తంలోని మోనోసైట్లు మాక్రోఫేజ్‌లుగా ఎలా మారుతున్నాయో గుర్తించగలిగారు.

సాధారణంగా తెల్ల రక్తకణాలు, మోనోసైట్ల నుంచి జనించే ఈ మాక్రోఫేజ్‌లు వాటికవే వృద్ధిచెందుతాయి. అనంతరం అవి జన్యుపరంగా నిర్ణయించిన వివిధ రకాలుగా విభజించబడతాయి. మానవుల్లో వీటిని క్లాసికల్‌ CD14+ మోనోసైట్స్‌గానూ, నాన్‌ క్లాసికల్‌ CD16+ మోనోసైట్లుగా పేర్కొంటారు. అయితే, వాయుమార్గాల ద్వారా ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించిన మోనోసైట్లు, మాక్రోఫేజ్‌లుగా మారి ఊపిరితిత్తులను రక్షిస్తాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. పరిశోధనల్లో భాగంగా HLA-DRhi గా పిలిచే ఓ ప్రత్యేకమైన మోనోసైట్‌ను కూడా గుర్తించినట్లు తెలిపారు. ఈ మోనోసైట్లు రక్తప్రసరణ నుంచి బయటపడి ఊపిరితిత్తుల కణజాలనికి చేరుతాయని.. నాన్‌క్లాసికల్‌ మోనోసైట్లు మాత్రం ఊపిరితిత్తుల కణజాలానికి వెళ్లవని పరిశోధనకు నేతృత్వం వహించిన కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన నిపుణుడు డాక్టర్‌ టిమ్‌ విల్లింగర్‌ వెల్లడించారు. ఇలా ఊపిరితిత్తుల్లో ఉన్న మాక్రోఫేజ్‌లు బ్యాక్టీరియా, వైరస్‌లపై యుద్ధం చేస్తుండగా మరికొన్ని రకాల మాక్రోఫేజ్‌లు మాత్రం ఇన్‌ఫెక్షన్లు, వాపునకు కారణమవుతున్నాయని తెలిపారు. కరోనా వంటి కేసుల్లో ఊపిరితిత్తులకు దోహదం చేసే మాక్రోఫేజ్‌ల స్థానాన్ని.. వ్యతిరేకంగా పనిచేసే మాక్రోఫేజ్‌లు ఆక్రమించడం వల్లే ఊపిరితిత్తులకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నట్లు స్పష్టంచేశారు.

వైరస్‌ సోకిన వారిలో తీవ్ర ఊపిరితిత్తుల వ్యాధులకు గల కారణాలను తాజా పరిశోధన ద్వారా స్వీడన్‌ శాస్త్రవేత్తలు విశ్లేషించారు. ఇలా వేగంగా మార్పునకు కారణమయ్యే మోనోసైట్లు, మాక్రోఫైజ్‌ల పనితీరును తెలుసుకోవడం కరోనా చికిత్సకు మరింత దోహదం చేస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

ఇవీ చదవండి..
కరోనా ఎఫెక్ట్‌: యువతలో పెరిగిన ఆందోళన..!
కరోనా బారిన పడిన వారిలో కొత్త సమస్య

 

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని