‘విశాఖ బంద్‌’: స్టీల్‌ ప్లాంట్‌ జోలికొస్తే ఊరుకునేది లేదు: కార్మిక సంఘాలు

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అఖిల భారత కార్మిక సంఘాలు, పారిశ్రామిక ఉద్యోగ సంఘాలు ‘విశాఖ బంద్‌’ చేపట్టాయి.

Updated : 28 Mar 2022 12:11 IST

విశాఖ: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అఖిల భారత కార్మిక సంఘాలు, వామపక్షాలు, పారిశ్రామిక ఉద్యోగ సంఘాలు ‘విశాఖ బంద్‌’ చేపట్టాయి. ఇందులో భాగంగా ప్లాంట్‌ ప్రధాన ద్వారం వద్ద కార్మిక సంఘ నాయకుల నిరసన తెలిపారు. బంద్‌ను విజయవంతం చేయాలంటూ ప్రజాసంఘాలు ర్యాలీ నిర్వహించాయి. ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమం తీవ్రతరం చేయాలని నిర్ణయించాయి. ఈ క్రమంలో మద్దిలపాలెంలో అఖిల కార్మిక కర్షక ఐక్య కార్యాచరణ సమితి నిరసన చేపట్టింది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ జోలికి వస్తే ఊరుకునేది లేదని కార్మిక సంఘాలు హెచ్చరించాయి.

ప్లాంట్‌పై అవగాహన లేకుండా కేంద్రమంత్రులు మాట్లాడుతున్నారని కార్మికులు మండిపడ్డారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ అంతా పోరాటాల చరిత్ర అని గుర్తు చేశారు. ప్లాంట్‌ను అమ్మే హక్కు ఎవరికీ లేదని పునరుద్ఘాటించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా పార్లమెంట్‌ సాక్షిగా అసత్యాలు చెబుతున్నారని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటీకరణ నిర్ణయం ఉపసంహరించుకునే వరకు పోరాటం ఆగదని వామపక్ష నాయకులు చెప్పారు. బంద్‌లో భాగంగా ద్విచక్ర వాహన ర్యాలీలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ అఖిల భారత కార్మిక సంఘాలు, పారిశ్రామిక ఉద్యోగ సంఘాలు రెండు రోజుల పాటు బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని