50 శాతం ధరకే దేశీయ రోబోలు

వైద్యం, ఆతిథ్యం సహా వివిధ రంగాల్లో రోబోల వినియోగాన్ని అందించేందుకు హైదరాబాద్‌కు చెందిన విస్టాన్‌ నెక్ట్స్‌జెన్‌ అంకుర సంస్థ ముందుకొచ్చింది. కంపోనెంట్ల కోసం చైనా, జపాన్‌ దేశాలపై ఆధారపడకుండా....

Published : 26 Jan 2021 01:51 IST

విస్టాన్‌ నెక్ట్స్‌జెన్‌ సీఈఓ రామరాజుతో ముఖాముఖి

ఇంటర్నెట్ డెస్క్‌: వైద్యం, ఆతిథ్యం సహా వివిధ రంగాల్లో రోబోల వినియోగాన్ని అందించేందుకు హైదరాబాద్‌కు చెందిన విస్టాన్‌ నెక్ట్స్‌జెన్‌ అంకుర సంస్థ ముందుకొచ్చింది. కంపోనెంట్ల కోసం చైనా, జపాన్‌ దేశాలపై ఆధారపడకుండా పూర్తిస్థాయిలో దేశీయంగా అందించేందుకు హైదరాబాద్‌లో అతిపెద్ద కేంద్రాన్ని ఏర్పాటుచేసింది. రెస్టారంట్లు, ఆసుపత్రులు, బ్యాంకుల్లో సేవలందించే రోబోలను సిద్ధం చేశామని సంస్థ వ్యవస్థాపక సీఈఓ రామరాజు  వెల్లడించారు. స్వదేశీ పరిజ్ఞానంతో తక్కువ ఖర్చుకే రోబోలు అందిస్తామంటున్న రామరాజుతో ఈటీవీ ముఖాముఖి నిర్వహించింది.

రోబోలను ఉత్పత్తి చేయడంలో మీరు ఎలాంటి నైపుణ్యాన్ని వినియోగిస్తున్నారు? మీ వద్ద ఎన్ని రకాల రోబోలు అందుబాటులో ఉన్నాయి?
రామరాజు: గత 20 సంవత్సరాలుగా నేను ఇంగ్లాండ్‌లోని పలు సంస్థల్లో పని చేసి నైపుణ్యం గడించాను. దేశానికి ఏదైనా చేయాలని తిరిగి భారత్‌కు వచ్చాను. ప్రధాని మోదీ ఆత్మనిర్భర్‌ భారత్‌ పిలుపుతో ఇక్కడ సంస్థను ప్రారంభించాం. ప్రస్తుతం 40 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రస్తుతం మా వద్ద 22 రకాల రోబోలు ఉన్నాయి. మిషిన్‌ లర్నింగ్‌, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌, ఐఓటీ మీద అనేక ప్రాజెక్టులను చేపట్టాం. నేషనల్‌ ఇన్ఫర్మేషన్‌ సెంటర్‌ (ఎస్‌ఐసీ)తో కలిసి పనిచేస్తున్నాం. రెండు తెలుగు రాష్ట్రాలతో కలిసి పనిచేస్తున్నాం. కరోనా కాలంలో ఇబ్బందులు ఏర్పడుతున్న నేపథ్యంలో రోబోల వినియోగం ఉపయోగకరంగా ఉంటుంది. ప్రస్తుతం రెస్టారంట్ రోబోలను అందుబాటులోకి తీసుకొచ్చాం.

రెస్టారంట్‌తోపాటు ఏయే రంగాలపై దృష్టి సారించారు?
రామరాజు: ఆసుపత్రుల్లో రోబోల సేవలందించాలనుకుంటున్నాం. రిసెప్షన్‌ వద్ద రోబోను ఉంచి అపాయింట్‌మెంట్‌ ప్రక్రియను ముగించేలా రోబోను సిద్దం చేశాం. ఆ రోబో రోగికి డిసిన్ఫెక్షన్‌తోపాటు శానిటైజేషన్‌ చేస్తుంది. ప్రాథమిక పరీక్షలు కూడా చేస్తుంది.

రోబోల కోసం ఇతర దేశాలపైనే ఆధారపడుతున్నాం. మొదటిసారి మీరు హైదరాబాద్‌ నుంచే ఉత్పత్తి ప్రారంభించారు. రోబో విడిభాగాలను ఎక్కడ తయారు చేస్తున్నారు?
రామరాజు: ఆత్మనిర్భర్‌ భారత్‌ కార్యక్రమంలో భాగంగా మా సంస్థలోనే విడిభాగాలను తయారు చేస్తున్నాం. విస్టాన్‌ సంస్థలోనే అన్ని రకాల పరికరాలను రూపొందించి వాటికి మెరుగులు దిద్దుతున్నాం. 
ఈటీవీ: ఇప్పటికే దేశంలోని పలు రెస్టారంట్లు, ఆసుపత్రుల్లో రోబోలను వినియోగిస్తున్నారు. వాటికి, మీరు రూపొందించిన వాటికి తేడా ఏమిటి? విస్టాన్‌ నెక్ట్స్‌జెన్‌ రోబో ప్రత్యేకత ఏమిటి?
రామరాజు: మా రోబోలతో ఒక ప్యాకేజీ ఇస్తున్నాం. సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌ అందిస్తున్నాం. రోబోలను లీజుకు తీసుకునేందుకు ‘రోబో యాజ్‌ ఏ సర్వీస్‌’ అనే పద్ధతిని మొదటిసారి మన దేశంలో ప్రవేశపెట్టనున్నాం.

సర్వీస్‌ హెల్త్‌ ఓడియంటెండ్‌ రంగానికి సంబంధించి రోబోలను సిద్ధం చేసి అమ్మకానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంటున్నారు. మరే ఇతర రంగాలను రోబోలను అందుబాటులోకి తేనున్నారు?
రామరాజు: పలు రంగాల్లో రోబోలను ప్రవేశపెట్టనున్నాం. రిటైల్‌, బ్యాంకింగ్‌ రంగాల్లో రోబోలను అందుబాటులోకి తీసుకురానున్నాం. అన్ని రకాల రోబోలను భారత్‌లో అందుబాటులోకి తీసుకురానున్నాం. సోషన్‌ హ్యూమనైడ్‌ రోబోలను కూడా అభివృద్ధి చేస్తున్నాం. ఇది ఒంటరిగా ఉన్న వ్యక్తికి అన్ని రకాల సేవలందిస్తుంది. ఇది రానున్న జులైలో అందుబాటులోకి రానుంది. 

మీరు రూపొందిస్తున్న రోబోలు ఏ ధరకు విక్రయించనున్నారు?
రామరాజు: చాలా తక్కువ ధరకే మా రోబోలను విక్రయిస్తున్నాం. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే దాంట్లో దాదాపు 50 శాతం ధరకే అమ్ముతున్నాం. లీజుకు కూడా ఇవ్వనున్నాం. ఈఎంఐ అవకాశం కల్పిస్తున్నాం. చిన్నస్థాయి వ్యాపారాలకు సైతం తక్కువ ఖర్చుతో రోబోలు అందిస్తాం.

ఇవీ చదవండి...

తేజస్‌పై ప్రపంచ దేశాల ఆసక్తి

యూఎస్‌లో ‘కొత్త ఆశలకు రెక్కలు’!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని