Viveka murder case: కడప నుంచి హైదరాబాద్‌కు చేరిన వివేకా హత్యకేసు దస్త్రాలు

కడప జిల్లా సెషన్స్‌కోర్టు నుంచి వివేకా హత్యకేసుకు సంబంధించిన ఛార్జిషీట్లు, సాక్షుల వాంగ్మూలాలు, ఆధారాలు, ఇతర దస్త్రాలను 3 ట్రంకు పెట్టెల్లో హైదరాబాద్‌ సీబీఐ కోర్టుకు తరలించారు. 

Published : 24 Jan 2023 17:40 IST

హైదరాబాద్‌: మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసు విచారణను తెలంగాణకు బదిలీ చేసిన నేపథ్యంలో ఈకేసుకు సంబంధించిన దస్త్రాలను హైదరాబాద్‌ ప్రిన్సిపల్‌ సీబీఐ కోర్టుకు తరలించారు. ఛార్జిషీట్లు, సాక్షుల వాంగ్మూలాలు, ఆధారాలు, ఇతర దస్త్రాలను 3 ట్రంకు పెట్టెల్లో కడప జిల్లా సెషన్స్‌కోర్టు నుంచి హైదరాబాద్‌ సీబీఐ కోర్టుకు తరలించారు. వివేకాహత్య కేసును దిల్లీ సీబీఐ విభాగం దర్యాప్తు చేస్తోంది. ఎర్ర గంగిరెడ్డి, సునీల్‌ యాదవ్‌, ఉమాశంకర్, దస్తగిరిపై ప్రధాన ఛార్జిషీట్‌, దేవిరెడ్డి శంకర్‌రెడ్డిపై అనుబంధ ఛార్జిషీట్‌ను కడప జిల్లా సెషన్స్‌ కోర్టులో గతంలో సీబీఐ దాఖలు చేసింది. అయితే కేసు విచారణ ఏపీ నుంచి బదిలీ చేయాలన్న వైఎస్‌ వివేకా కుమార్తె సునీత అభ్యర్థన మేరకు.. తెలంగాణకు బదిలీ చేస్తూ ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఫైళ్లన్నీ హైదరాబాద్‌ సీబీఐ కోర్టుకు దర్యాప్తు సంస్థ చేర్చింది. ఛార్జిషీట్లు పరిశీలించాలని కోర్టు కార్యాలయాన్ని న్యాయస్థానం ఆదేశించింది. కోర్టు పరిశీలించి ఛార్జిషీట్‌కు నంబరు కేటాయించిన తర్వాత హైదరాబాద్‌లో విచారణ ప్రక్రియ ప్రారంభం కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని