CP Rangnath: బండి సంజయ్‌తో నాకు గట్టు పంచాయితీ లేదు: సీపీ రంగనాథ్‌

పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం కేసులో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తనపై చేసిన ఆరోపణలు వరంగల్‌ సీపీ రంగనాథ్‌ ఖండించారు. 

Updated : 11 Apr 2023 22:20 IST

వరంగల్‌: పదోతరగతి హిందీ ప్రశ్నపత్రం వాట్సప్‌లో చక్కర్లు కొట్టిన ఘటన తెలంగాణలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో అరెస్టై బెయిల్‌పై బయటికొచ్చిన తర్వాత భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఆ పార్టీ నేతలు వరంగల్‌ సీపీపై విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో మంగళవారం వరంగల్ సీపీ రంగనాథ్‌ మీడియా సమావేశం ఏర్పాటు చేసి బండి సంజయ్‌ ఆరోపణలు ఖండించారు. ఈ కేసులో నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.

‘‘బండి సంజయ్‌ నాపై అనేక ఆరోపణలు చేశారు. ప్రమాణం చేయమంటున్నారు. మేం ప్రమాణం చేసిన తర్వాతే ఉద్యోగంలోకి వస్తాం. ప్రతి కేసులో ప్రమాణం చేయాలంటే.. ఇప్పటి వరకు 10వేల సార్లు ప్రమాణం చేయాలి. ఈ కేసులో కూడా ప్రమాణం చేయాలంటే చేస్తాం. పరీక్ష ప్రారంభమయ్యాక పేపర్‌ బయటికొస్తే లీకేజీ కాదు. హిందీ ప్రశ్నపత్రం మాల్‌ ప్రాక్టీస్‌ మాత్రమే.. లీకేజీ కాదు. దానికి ముందు జరిగినదంతా పరిగణనలోకి తీసుకున్నాం. హిందీ ప్రశ్నపత్రం కేసులో రాజకీయాలకు ఎక్కడా తావులేదు. పార్టీలకు అతీతంగా కేసు దర్యాప్తు చేస్తాం. దయ చేసి రాజకీయాలు అంటగట్టొద్దు. సమస్యలపై మా దగ్గరకు వచ్చేవారికి పార్టీలకు అతీతంగా న్యాయం చేస్తాం.

 బండి సంజయ్‌ ఫోన్‌ మా దగ్గర లేదు. నేను ఎలాంటి సెటిల్‌ మెంట్లు, దందాలు చేయను. దర్యాప్తు ఏజెన్సీలను బెదిరించే ప్రయత్నం మంచిది కాదు. బండి సంజయ్‌తో నాకు ఎలాంటి గట్టు పంచాయితీ లేదు. మా ఉద్యోగ ధర్మం మమ్మల్ని చేయనివ్వండి. సత్యంబాబు కేసులో నాపై ఆరోపణలు చేశారు. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి. సత్యంబాబుకు జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించింది. టెక్నికల్‌ రీజన్స్‌తో అప్పీల్‌లో హైకోర్టు కొట్టివేసింది. ఆ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. సత్యంబాబు కేసు దర్యాప్తు అధికారి నేను కాదు. ఆ విషయం బండి సంజయ్‌ తెలుసుకోవాలి’’ అని సీపీ సూచించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని