Leopard attack: చేతి కర్రతోనే చిరుతను తరిమిన వృద్ధురాలు

కళ్లెదుట ఒక్కసారిగా క్రూర మృగం ప్రత్యక్షమైతే సాధారణంగా ఎవరికైనా వెన్నులో వణుకు పుడుతుంది! కానీ.. ఓ వయోవృద్ధురాలు మాత్రం సమయస్ఫూర్తితో వ్యవహరించారు. తనపై దాడికి యత్నించిన ఓ చిరుతను తన చేతి కర్రతోనే తరిమికొట్టడం గమనార్హం. ముంబయి శివారులోని...

Updated : 24 Nov 2022 14:30 IST

ముంబయి: కళ్లెదుట హఠాత్తుగా క్రూర మృగం ప్రత్యక్షమైతే సాధారణంగా ఎవరికైనా వెన్నులో వణుకు పుడుతుంది! కానీ.. ఓ వృద్ధురాలు మాత్రం సమయస్ఫూర్తితో వ్యవహరించారు. తనపై దాడికి యత్నించిన ఓ చిరుతను చేతి కర్రతోనే తరిమికొట్టారు. ముంబయి శివారులోని ఆరే కాలనీలో ఈ ఘటన వెలుగుచూసింది. దీనికి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. స్థానికంగా నివసించే నిర్మలాదేవీ సింగ్‌ బుధవారం రాత్రి చేతి కర్ర ఊతంతో నడుచుకుంటూ వచ్చి ఇంటి ప్రాంగణంలో కూర్చున్నారు. అప్పటికే అక్కడ ఓ చిరుత నక్కి ఉన్న విషయాన్ని ఆమె గుర్తించలేదు. ఈ క్రమంలో అదను చూసిన చిరుత.. ఆమెపై దాడికి దిగింది. అనుకోని ఘటనతో ఆమె వెనక్కుపడిపోయింది. వెంటనే తేరుకొని, తన చేతికర్రతోనే చిరుతను ప్రతిఘటించింది. దీంతో కొద్దిసేపటికి చిరుత అక్కడినుంచి పారిపోయింది. ఈ ఘటనలో ఆమెకు స్వల్పగాయాలు కాగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉండగా ఈ ప్రాంతంలో చిరుత దాడి జరగడం మూడు రోజుల వ్యవధిలో ఇది రెండోసారి. రెండు రోజుల క్రితం ఇంటి బయట ఆడుకుంటున్న ఓ నాలుగేళ్ల బాలుడిపై దాడి చేసింది. స్థానికులు వెంటనే అప్రమత్తమై అతన్ని రక్షించారు. ఆరే కాలనీ ముంబయి శివారు ప్రాంతం కావడం, చుట్టూ అటవీ ప్రాంతం ఉండటంతో.. ఈ తరహా ఘటనలూ గతంలోనూ చోటుచేసుకున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని