బాధలో ఉన్న స్నేహితుడికి సాయపడండిలా..!

రక్త సంబంధం లేకున్నా జీవితంలో ఓ ముఖ్యమైన బంధం స్నేహం. సెలవు దొరికితే స్నేహితులతో సరదాగా గడిపేస్తారు. సినిమాలు, షికార్లకు వెళ్తారు. పరీక్షల్లో పాస్‌ అయినా, ప్రేమలో గెలిచినా, ఉద్యోగం వచ్చినా, పెళ్లి కుదిరినా ఇలా ప్రతి సంతోషకరమైన సందర్భంలోనూ స్నేహితులంతా

Updated : 10 Oct 2020 12:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రక్త సంబంధం కాకుండా జీవితంలో ఓ ముఖ్యమైన బంధం స్నేహం. జీవితంలో ప్రతిఒక్కరూ ఎక్కువగా స్నేహితులతో సరదాగా గడుపుతుంటారు. సినిమాలు, షికార్లకు వెళ్తారు. పరీక్షల్లో పాస్‌ అయినా, ప్రేమలో గెలిచినా, ఉద్యోగం వచ్చినా, పెళ్లి కుదిరినా ఇలా ప్రతి సంతోషకరమైన సందర్భంలోనూ స్నేహితులతోనే ఆనందాన్ని పంచుకుంటున్నారు. అలా సంతోషాలు పంచుకునే స్నేహితులే.. ప్రేమ విఫలం, ఆర్థిక పరిస్థితులు, ఉద్యోగంలో ఇబ్బందులు వంటి తదితర విషయాల్లో మానసికంగా బాధపడుతున్న సందర్భాలు ఉంటాయి. మీ స్నేహితుల్లోనూ ఎవరైనా అలా మానసికంగా కుంగిపోతుంటే వారిని ఓదార్చే ప్రయత్నం చేసే ఉంటారు. కానీ, వారిని సాధారణ స్థితికి తీసుకురావడం కోసం ఈ విధంగా ప్రయత్నించి చూడండి..!

సహనం వహించి.. టచ్‌లో ఉండండి

మానసికంగా కుంగిపోయే చాలా మంది తమ బాధను ఎదుటివారికి చెప్పడానికి ఇష్టపడరు. కనీసం మాట్లాడరు కూడా. మౌనంగా ఉండేందుకు ప్రాధాన్యమిస్తారు. ఏం చెప్పట్లేదు, మాట్లాడట్లేదని కోపం తెచ్చుకొని స్నేహితులను ఒంటరిగా వదిలేయకండి. కాస్త ఓపిక పట్టండి. మీతో మాట్లాడకపోయినా మీరే అప్పుడప్పుడు పలకరిస్తూ ఉండండి. అటు నుంచి స్పందన లేకున్నా గతంలోలాగే ముచ్చట్లు పెట్టండి. సహనంతో ఉంటే.. కొంచెం సమయం పట్టినా కచ్చితంగా వారి బాధను మీతో చెప్పుకుంటారు.

బాధేంటో గుర్తించే ప్రయత్నం చేయండి

స్నేహితులు తమ బాధేంటో చెప్పకపోయినా తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఏం జరిగింది, ఎందుకలా ఉన్నారో అడగండి. ఏ విషయంలో మానసికంగా కుంగిపోతున్నారో తెలుసుకుంటే దాని నుంచి వారిని బయటపడేసే మార్గం వెతకొచ్చు. 

శ్రద్ధగా వినండి

బాధలో ఉన్న స్నేహితులకు అండ అవసరం. అందుకే స్నేహితులు తమ బాధను చెప్పుకునే సమయంలో శ్రద్ధగా వినండి. కొన్ని విషయాల్లో చెప్పుకోవడం ద్వారానే బాధ తగ్గిపోతుంది. స్నేహితులది అలాంటి సమస్యే అయితే శ్రద్ధగా విని వారి బాధను పొగొట్టొచ్చు. ఫోన్‌లో లేదా వ్యక్తిగతంగా కలిసి మాట్లాడాలి అంటే.. వెంటనే ఓకే చెప్పేయండి. మీరు కుదరదు, తర్వాత మాట్లాడుకుందాం అని అన్నారంటే.. చెప్పాలనే ఆసక్తిని వారు కోల్పోయే అవకాశమూ ఉంటుంది. 

నడకకు తీసుకెళ్లండి

నడక కేవలం ఆరోగ్యానికే కాదు, మానసిక దృఢత్వాన్నీ ఇస్తుంది. మూడ్‌ను మార్చేస్తుంది. కాబట్టి, మీ స్నేహితుల్లో ఎవరైనా మానసికంగా బాగాలేరని అనిపిస్తే.. వారిని నడకకు తీసుకెళ్లండి. పిచ్చాపాటిగా మాట్లాడండి. పరిసరాలను పరిశీలిస్తూ వాటి గురించి చర్చించండి. దీనివల్ల స్నేహితులు బాధ నుంచి తేరుకోవచ్చు. 

సాయం చేయండి

అవసరాల్లో ఆదుకునేవాడే నిజమైన స్నేహితుడు అని అంటుంటారు. కాబట్టి మీ స్నేహితుల బాధేంటో తెలుసుకొని మీకు వీలైతే తీర్చే ప్రయత్నం చేయండి. ఆర్థిక విషయాలు అయితే మీవంతు సాయం చేయొచ్చు లేదా ఆర్థిక సమస్యలు తీరే పరిష్కారం చూపించొచ్చు. వృత్తి, ఉద్యోగాల విషయమైతే వారి సమర్థతను బట్టి ఉద్యోగం ఇప్పించేలా సిఫారసు చేయొచ్చు.

నిపుణులకు చూపించండి

చాలా మంది మానసిక కుంగుబాటును సాధారణ విషయంగా పరిగణిస్తుంటారు. కానీ, ఇలాంటి విషయాల్లోనూ మానసిక వైద్యనిపుణులను సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. దీనికి ఎవరూ ఒప్పుకోరు. అందుకే స్నేహితుల మానసిక స్థితి దారుణంగా ఉంటే.. మీ వంతుగా వారిని నిపుణుల వద్దకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. కౌన్సెలింగ్‌ ఇప్పించండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని