UN: మహమ్మారికి త్వరగా ముగింపు పలకాలి: ఐరాస చీఫ్‌

40 లక్షలకు పైగా ప్రజల ప్రాణాలను బలిగొన్న కొవిడ్‌ మహమ్మారిని అరికట్టే ప్రక్రియ చాలా నెమ్మదిగా సాగుతోందని ఐక్యరాజ్యసమితి ఆవేదన వ్యక్తం చేసింది.....

Updated : 23 Feb 2024 18:46 IST

జెనీవా: 40 లక్షలకు పైగా ప్రజల ప్రాణాలను బలిగొన్న కొవిడ్‌ మహమ్మారిని అరికట్టే ప్రక్రియ చాలా నెమ్మదిగా సాగుతోందని ఐక్యరాజ్యసమితి ఆవేదన వ్యక్తం చేసింది. మహమ్మారిని త్వరితగతిన అంతం చేయాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో అనేక దేశాలు వెనుకబడ్డాయని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్‌ ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాక్సినేషన్‌ వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

సోమవారం జరిగిన 76వ ఐరాస సర్వసభ్య సమావేశంలో గుటెర్రస్‌ మాట్లాడుతూ.. ‘మునుపెన్నడూ లేనివిధంగా ప్రపంచం ప్రస్తుతం పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. వాతావరణ మార్పులు, పలు వివాదాలు మొదలు...  కొవిడ్‌ కారణంగా సుస్థిర అభివృద్ధిలో వెనుకబడిపోతున్నాం. ఈ మహమ్మారికి త్వరగా ముగింపు పలకాలి. కొవిడ్‌ను అరికట్టడంతో నెమ్మదిగా ఉన్నాం. అసమానతలను అధిగమించాలి. వచ్చే ఏడాది జూన్‌ నాటికి ప్రపంచంలోని 70 శాతం మందికి వ్యాక్సినేషన్‌ పూర్తయ్యేలా టీకా ఉత్పత్తిని రెట్టింపు చేయాల్సిన అవసరం ఉంది’ అని ఐరాస చీఫ్‌ వెల్లడించారు.

కరోనాతోపాటు మరో నాలుగు అంశాలపైనా గుటెర్రస్‌ మాట్లాడారు. సంక్షోభంలో ఉన్న దేశాలు దాని నుంచి బయటపడేందుకు కృషి చేయాలని సూచించారు. అలా చేస్తేనే రానున్న రోజుల్లో పేదరికాన్ని నివారించగలమని పేర్కొన్నారు. పురుషులకు సమానంగా మహిళలు, బాలికలకు హక్కులు కల్పించాలని కోరారు. లింగసమానత్వం లేకపోతే ఎలాంటి లక్ష్యాలను చేరుకోలేమన్నారు. వాతావరణాన్ని కాపాడుకునేందుకు అసమాన కృషి చేయాల్సిన అవసరం ఉందని.. 2050 నాటికి కాలుష్య ఉద్గారాలను పూర్తిగా తగ్గించేందుకు విశేష కృషి చేయాలని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని