బొబ్బిలి యుద్ధ విశేషాలు చూడర బాబు!

బొబ్బిలి పేరు చెబితే వెంటనే గుర్తొచ్చేది.. తాండ్ర పాపారాయుడి శౌర్యం, పరాక్రమం. తెలుగు చరిత్రలో ఓ విశిష్ఠ స్థానం సంపాదించుకున్న బొబ్బిలి యుద్ధం గురించి ఎంత చెప్పినా తక్కువే.

Published : 17 Nov 2021 15:29 IST

విజయనగరం: బొబ్బిలి పేరు చెబితే వెంటనే గుర్తొచ్చేది.. తాండ్ర పాపారాయుడి శౌర్యం, పరాక్రమం. తెలుగు చరిత్రలో ఓ విశిష్ఠ స్థానం సంపాదించుకున్న బొబ్బిలి యుద్ధం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏ తరానికైనా ఆసక్తి కలిగించే యుద్ధం అది. బొబ్బిలి రాజవంశీయులు వినియోగించిన ఆయుధాలు, దుస్తులు సహా వివిధ వస్తువులతో అక్కడి కోటలో ఏర్పాటు చేసిన మ్యూజియం విశేషంగా ఆకట్టుకుంటోంది. 18వ శతాబ్దం మధ్యలో బొబ్బిలి జమీందారు రాజా గోపాలకృష్ణ రంగారావుకు, విజయనగర సంస్థానం రాజు పూసపాటి పెదవిజయరామరాజుకు మధ్య వైరం ఉండేది. ఫ్రెంచి కమాండర్‌ ఇన్‌ చీఫ్‌ బుస్సీ సాయంతో బొబ్బిలి సైన్యాన్ని.. విజయనగర సైన్యం ఢీకొట్టింది. అదే బొబ్బిలి యుద్ధం. చరిత్రలో ఎన్నో యుద్ధాలు జరిగినా.. బొబ్బిలి యుద్ధం ప్రత్యేకమైంది. తాండ్ర పాపారాయుడు ప్రతాపానికి, వీరత్వానికి ఈ యుద్ధం ప్రతీకగా నిలిచింది. నేటికీ ఈ యుద్ధ ఘట్టాలను వివిధ కళారూపాల్లో ప్రదర్శిస్తుంటారు. బొబ్బిలి రాజ వంశీయుల మ్యూజియంలో అలనాటి యుద్ధ సామగ్రి ఆకట్టుకుంటోంది. 1757లో బొబ్బిలి యుద్ధ సమయంలో ఉపయోగించిన కత్తులు, తుపాకులు, ఇతర ఆయుధాలు సహా, దుస్తులు, సింహాసనాలు, పల్లకీలను.. కోటలో ప్రత్యేకంగా నిర్మించిన మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. ఖరీదైన కిరీటాలు, రాజ వంశీయులు వేటాడిన పెద్ద పులుల చర్మాల లాంటి ఎన్నో చారిత్రక విశేషాలు కోటలోని దర్బారు మహల్‌లో ఏర్పాటు చేసిన ఈ మ్యూజియంలో కొలువుదీరాయి. రాజవంశీకులు వినియోగించిన అరుదైన కార్లను కోట ప్రాంగణంలో ప్రదర్శనకు పెట్టారు. అవి చూపరులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.   


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని