Wedding: వివాహ తంతులో ఊడిపోయిన వరుడి విగ్గు.. పెళ్లికి వధువు ససేమిరా

వరుడికి సంబంధించిన ఓ నిజాన్ని దాయడంతో ఆ పెళ్లి పెటాకులైంది. పెళ్లి తంతులో వరుడి విగ్గు ఊడి, బట్టతల బయటపడటంతో ఆ వివాహమే రద్దయ్యింది.......

Updated : 23 May 2022 18:51 IST

లఖ్‌నవూ: వరుడికి సంబంధించిన ఓ నిజాన్ని దాయడంతో ఆ పెళ్లి పెటాకులైంది. పెళ్లి తంతులో వరుడి విగ్గు ఊడి, బట్టతల బయటపడటంతో ఆ వివాహమే రద్దయ్యింది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో జరిగింది. పెళ్లికుమారుడికి జుట్టు లేదన్న నిజాన్ని తెలుసుకున్న వధువు వివాహానికి ససేమిరా అనడంతో.. పెళ్లి తంతు అర్థాంతరంగా ఆగిపోయింది. వరుడి బంధువులంతా నిరాశతో వెనుదిరిగారు.

ఉన్నావ్‌లోని ఓ యువతికి, సమీప గ్రామానికి చెందిన యువకుడితో వివాహం నిశ్చయమైంది. యువకుడికి బట్టతల ఉందన్న విషయాన్ని చెప్పకుండా అతడి కుటుంబీకులు జాగ్రత్తపడ్డారు. పెళ్లికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు జరిగిపోయాయి. జయమాల వేడుక అనంతరం మండపంలోకి రావాల్సి ఉండగా.. ఉన్నట్టుండి వరుడు స్పృహతప్పి పడిపోయాడు. అతడ్ని లేపేందుకు తలపాగా తీసే క్రమంలో విగ్గు ఊడిపోయింది. దీంతో పెళ్లి కూతురుతోపాటు, ఆమె బంధువులు నిర్ఘాంతపోయారు. ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం జరిగింది.

బట్టతల ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోనని వధువు తేల్చి చెప్పింది. మోసం చేసి పెళ్లి చేయాలని చూశారని ఆమె బంధువులు ఆరోపించారు. ఈ క్రమంలో పోలీసులకు సమాచారం అందింది. వారు వచ్చి ఇరు కుటుంబాలను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. అనంతరం పెద్దల సమక్షంలో పంచాయితీ జరిగింది. పెళ్లి కోసం ఇప్పటివరకు రూ.5.66 లక్షలు ఖర్చు చేసినట్లు వధువు తండ్రి తెలుపగా.. ఆ డబ్బును ఇచ్చేందుకు వరుడి కుటుంబీకులు అంగీకరించారు. వధువు లేకుండానే తిరిగి పయనమయ్యారు. బట్టతల గురించి ముందే చెప్పి ఉంటే వధువును ఒప్పించేందుకు ప్రయత్నించేవాళ్లమని, ఆ విషయం చెప్పకుండా మోసం చేశారని వధువు కుటుంబీకులు ఆరోపించారు. బట్టతల చూసిన షాక్‌లో ఆమె వివాహానికి ఒప్పుకోవడంలేదని పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని