ఆహ్వానం 2021..అనూహ్య ప్రపంచానికి!

2020.. కుదుపు... అతి పెద్ద కుదుపు! కాలం సాగిపోతున్నా... మానవాళి ఆగిపోయింది! లాక్‌డౌన్లు, ఐసోలేషన్లలో బందీ అయ్యింది! మానవాళి చరిత్రపై చెరగని మచ్చలా సంతకం చేసిన 2020ని నెమరువేసుకునే ..

Updated : 01 Jan 2021 09:32 IST

2020.. కుదుపు... అతి పెద్ద కుదుపు! కాలం సాగిపోతున్నా... మానవాళి ఆగిపోయింది! లాక్‌డౌన్లు, ఐసోలేషన్లలో బందీ అయ్యింది! మానవాళి చరిత్రపై చెరగని మచ్చలా సంతకం చేసిన 2020ని నెమరువేసుకునే బదులు... సరికొత్త దశాబ్దానికి సింహద్వారంలాంటి 2021 ఎలా ఉండబోతోందో చూడటం మేలు!

అన్నింటా అలుముకుంటున్న ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌లు...అల్లుకుంటున్న ఆల్గరిథమ్‌ల మధ్య...అనూహ్య ఆవిష్కరణలెన్నో ఆవిష్కృతమయ్యే అవకాశమున్న దశాబ్దంలోకి అడుగెడుతున్న వేళ.... రండి చూద్దాం... కొన్ని సూత్రాల్ని.... అనిశ్చిత ప్రపంచంలో మన బతుకును నిర్దేశించే మార్గాల్ని...అనుక్షణం ఆ సునామీకి సిద్ధమా!

మంచి నీటి కోసం ఇంట్లో ఫిల్టర్లు పెట్టుకుంటున్నట్లే... ఇకముందు మంచి వార్తల కోసం కూడా ఫిల్టర్లు అవసరమవుతాయ్‌! స్మార్ట్‌ పరికరాల పుణ్యమా అని... వద్దన్నా విపరీతమైన సమాచారం... మనపై సునామీలా వచ్చి పడుతోంది. పనికొచ్చేది, పనికిరానిది, ఏది నిజమో, ఏది అబద్దమో తేల్చుకోవటం కష్టమయ్యేంతగా! అది రెచ్చగొట్టొచ్చు.. ఊరికే ఆనందం కల్గించొచ్చు, దృష్టి మళ్ళించొచ్చు, అనవసరంగా ఆందోళన రేకెత్తించొచ్చు...భయపెట్టొచ్చు, నమ్మించొచ్చు... చివరకది నిజం కావొచ్చు... కాకపోవచ్చు...దీన్ని ఎలా తట్టుకుంటాం...ఎలా ఫిల్టర్‌ చేసుకుంటాం. ఎలా నిగ్రహించుకుంటాం అనేది కీలకం కాబోతోంది. మంచి న్యూస్, విశ్వసనీయ మీడియాను ఎంచుకోవాల్సింది మనమే! కేవలం అక్షరాస్యులమైతే సరిపోదు... విశ్వనీయాక్షరాస్యులం కావాలి!

ప్రకృత-జ్ఞత చూపాల్సిందే..
ఒకవైపు అనూహ్య ఆవిష్కరణలతో దూసుకెళుతున్నామనుకుంటుంటే... మరోవైపు అనూహ్య పరిణామాలతో మానవాళికి సవాళ్ళు విసురుతోంది ప్రకృతి! అభివృద్ధి వేటలో మనిషి పరిధులు దాటుతున్న వేళ సంభవిస్తున్న ప్రళయాలు! కరుగుతున్న మంచు, మునుగుతున్న తీర ప్రాంతాలు... అకాల వర్షాలు.. తీవ్రమైన ఎండలు.. అంతరించిపోతున్న జీవజాలం... నీటి ఎద్దడి... అడవుల్లో కార్చిచ్చులు... భూతాపం... పాపంలా చుట్టుకుంటున్నాయి. వీటి ప్రభావం నుంచి తప్పించుకోవాలంటే... ప్రకృతిని విచ్ఛిన్నం చేసే పనులాపాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. ఇంటలిజెన్స్‌ను మరింత ఇంటెలిజెంట్‌గా ఉపయోగించటం ఎలాగో మనందరం తెలుసుకోవాలి.

ఆ బిగ్‌బాస్‌ చూస్తుంటాడు!
హ్యాకింగ్‌... మన సిస్టమ్స్‌నే కాదు... మన మనసుల్ని కూడా చేరబోతోంది. డిజిటల్‌ డిక్టేటర్లు మనల్ని, మన జీవితాల్ని నియంత్రించబోతున్నారు! డేటా అనేది చూడటానికి రెండక్షరాల పదంలానే ఉన్నా... ఇది సృష్టించబోతున్న సంచలనం అంతా ఇంతాకాదు. యావత్‌ మానవాళిని ఈ డేటా అనేది తన గుప్పిట బిగించబోతోంది. రాజకీయంగా రాలేని నియంతృత్వం... డాటా రూపంలో వస్తే ఆశ్చర్యపోనవసరం లేదు. స్మార్ట్‌ కెమెరాలు, బయోమెట్రిక్‌ సెన్సార్లు, ఫేస్‌ రికగ్జిషన్‌ పరికరాలు... ఇవన్నీ కూడా అనుక్షణం మన బాహ్య కదలికలనే కాదు... మన అంతరాంతరాల్లోకి కూడా చొచ్చుకొని రాబోతున్నాయి. మనం ఇంటర్నెట్‌లో చేసే బ్రౌజింగ్‌ నుంచి మొదలెడితే... వివిధ సందర్భాల్లో ఇస్తున్న సమాచారం, మనలో భాగం కాబోతున్న బయోమెట్రిక్‌ సెన్సార్లు... మన గురించి మనకంటే ఎక్కువగా ఇతరులు తెలుసుకోవటానికి ఉపయోగపడుతోంది. మన శరీరంలో భాగం కాబోయే చిప్స్‌ మన బీపీ, షుగర్‌లనే కాదు... మన భావోద్వేగాలను కూడా అనుక్షణం రికార్డు చేస్తుంటుంది. ఈ బిగ్‌బాస్‌ నుంచి ఎలా తట్టుకుంటామనేది పెద్ద సవాలే! 

ఆ జోన్‌ను వదలాల్సిందే..
అలవాటైన ప్రాంతం...అలవాటైన చోటు... అలవాటైన పని... అలవాటైన మనుషులు... హాయిగా నడిచిపోతోంది గదా... ఇలాగే నడిపించేద్దాం... అని కడుపులో చల్ల కదలనట్లుగా ఉంటానంటే కుదరదు. కొత్త నైపుణ్యాల్ని, కొత్త పనులు, కొత్త ఆలోచనలను స్వాగతించకుంటే... పరిస్థితులకు అనుగుణంగా సామాజిక నైపుణ్యాలను, ఇంగితజ్ఞానాన్ని పెంచుకోకుంటే, కంఫర్ట్‌జోన్‌ను వదలి బయటకు రాకుంటే అంతేసంగతులు! కమ్యూనికేషన్‌తో పాటు కనెక్ట్‌ అవటం తెలియాలి. కనెక్ట్‌తో పాటు... డిస్‌కనెక్ట్‌ ఎప్పుడవ్వాలో కూడా తెలియాలి. 

బి రెడీ ఫర్‌ డిస్‌రప్షన్‌..
గత కొన్నేళ్ళుగా పదే పదే వినిపిస్తున్న పదం... కనిపిస్తున్న సత్యం- డిస్‌రప్షన్‌! ఏదీ ఉన్నట్లుండకపోవటం... వేగంగా మారిపోవటం... ప్రతి రంగంలోనూ నిరంతర విచలనం! ఆర్థికంలో, సాంకేతికతలో... ఇప్పటికే ఈ విచలిత పరిమాణాలను చూస్తునే ఉన్నాం! మునుముందు ఇది మరింత వేగం పుంజుకుంటే... మరిన్ని రంగాలకు విస్తరిస్తే కొలువులిప్పుడున్నట్లు ఉండకపోవచ్చు... పనులిలా ఉండకపోవచ్చు.. ఎవ్వరూ చెప్పలేరు భవిష్యత్‌లో ఏ రంగం ఎలా ఉండబోతోందో? ఒక్కటి మాత్రం చెప్పగలం... ఇప్పటికంటే చాలా భిన్నంగా ఉండబోతోంది! విచలితానికి అనుగుణంగా వేగంగా మనల్ని మనం మలచుకోవటం... ఇదే మన వశంలోని మంత్రం! ఆధునిక జీవన తంత్రం!

చిట్టితో సహజీవనానికి..
రోబో సినిమాలో నిషేధించిన ‘చిట్టి’ మన నిజజీవితంలోకి వేగంగా వచ్చేస్తోంది. ఇప్పటికే వచ్చేసింది! కృత్రిమ మేథతో మన జీవితాలు మారటం ఆరంభమైంది! ఆఫీస్‌ నుంచి బయల్దేరే ముందే...ఫోన్లోంచి ఇంట్లో గీజర్‌ను ఆన్‌ చేయొచ్చు... ఎలక్ట్రిక్‌ కుక్కర్‌ను ఆన్‌ చేసి వెళ్ళేసరికల్లా వంట పూర్తి చేయొచ్చు! చాలా కొలువులు, పనులు మారిపోతున్నాయి! మనుషులకు దూరమవుతున్నాయి. ఇన్నాళ్ళూ మన తోటి మనుషులతోనే కలసిమెలసి బతుకుతున్న మనం... ఇకమీదట జీవితంలో... జీతంలో రోబోలతో కలసి పనిచేయటం, జీవించటం ఎలాగో తెలుసుకోవాల్సిన సమయం ఆసన్నమవుతోంది.

గుట్టలెక్కడం.. పుట్టలెక్కడం కాదు..
మనిషి తన శారీరక శ్రమతో రొటీన్‌గా చేసే అనేక ఉద్యోగాలు హుష్‌ కాకి అవుతున్నాయ్‌! అలాగని భయపడాల్సిన పన్లేదు. రోబోలతో సహజీవనంలో మనం బతికి బయటకట్టాలంటే... అవి చేయలేనివి మనం చేయగలగాలి. క్రిటికల్‌ థింకింగ్‌; సహానుభూతి, సృజన, వ్యూహరచన, కళ, ఊహాత్మకత, ముందుచూపు... ఇవన్నీ మనిషికే సాధ్యమయ్యే పనులింకా! అవి నీదగ్గరుంటే వందమంది చిట్టిలొచ్చినా ఏమీ చేయలేవు. ఉద్యోగాలన్నీ పోయి... యంత్రాలే పనిచేస్తాయనటం వాస్తవదూరం! వస్తున్న మార్పునెలా నైపుణ్యంగా మనకు అన్వయించుకుంటామనేదే మనుగడకు మూలధారం!

ఈ ప్రపంచంలో మార్పు ఎప్పుడూ ఉన్నదే! రాబోయే కాలంలో ఇంకా వేగంగా మార్పులు రాబోతున్నాయి. వాటికి అనుగుణంగా మనం మారకుంటే మనుగడే ప్రమాదంలో పడొచ్చు! ఈ వేగంలో మనల్ని మనం ఎలా ఆవిష్కరించుకుంటామనేది కీలకం.  భవిష్యత్‌ను మనం కచ్చితంగా ఊహించలేకపోవచ్చు.  కానీ... ప్రభావితం చేయగలం! అందుకే అనూహ్య ప్రపంచానికి ఆహ్వానం... ధైర్యంగా! 

-ఈనాడు ప్రత్యేక విభాగం

ఇవీ చదవండి..
టీకాతో స్వాగతం

కొత్త ఏడాదిలో.. ఆర్థిక విజయోస్తు!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని